ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 10 : ‘ఇందిరమ్మ ఇండ్లకు మట్టి, ఇసుక దొరకడంలేదు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పడ్తలేవు. గ్రామాల్లో నాయకులంతా మమ్మల్ని తిడుతున్నరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఎదుట కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌గౌస్, వీర్నపల్లి మండలాధ్యక్షుడు భూత శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ఎల్లారెడ్డిపేటలోని ఓ ఫంక్షన్‌హాల్ పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సభావేదికకు పెద్దఎత్తున నాయకులు, లబ్ధిదారులు వస్తారని భావించారు. ఉదయం 11.30 గంటలకు కూడా అనుకున్న స్థాయిలో లబ్ధిదారులు రాకపోవడంతో అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారు.
సభలో ఎక్కువశాతం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పలువురు నాయకులు సైతం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. రేషన్‌కార్డులు పంపిణీ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సమస్యలపై పలువురు నాయకులు కలెక్టర్ ఎదుట సమస్యలను లేవనెత్తారు. ఇసుక, మట్టి రవాణాను సులభతరం చేయాలని, ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించేలా చూడాలని వేదికపై నుంచి కోరారు. అధికారిక సభావేదికపై బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, షేక్‌గౌస్, భూత శ్రీనివాస్ ముందు వరుసలో కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది.