వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 22: ‘వన్ స్టేట్.. వన్‌కార్డ్’ నినాదంతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థలోనూ ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, రిజర్వ్ పోలీసులకు ప్రత్యేక నిబంధనలు సరికాదని మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారు వరంగల్ ఆర్టీవో కార్యాలయం జంక్షన్ నుంచి ప్లకార్డులు పట్టుకొని రంగశాయిపేటకు ర్యాలీ గా వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసు లు వారిని అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే శాఖలో ఒకే విధానాన్ని అమలు చేయకుండా బెటాలియన్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కనీస సెలవులు సైతం మంజూరు చేయకుండా విధులకు హాజరుకావాలని ఆంక్షలు విధిస్తున్నారని, దీంతో కానిస్టేబుళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు.