పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం వనపర్తి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఎస్ఎఫ్, బీజీవీఎస్, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు.
క్రిస్మస్ సెలవులకు పిల్లలను ఇంటికి పంపాలని కోరితే ప్రిన్సిపాల్ బీసీ-సీ సర్టిఫికెట్ అడుగుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం వేములవాడలోని బోయినపల్లి గురుకుల పాఠశాల వద్ద నిరసన తెలిపారు. తాను ఎవరినీ సర్టిఫికెట్ అడగలేదని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఆదివాసీలందరికీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు తదితరులు పాల్గొన్నారు.