హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై ఆసక్తి పెంచుకుంటున్న విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఎంటెక్ కోర్సుల్లోనూ సీఎస్ఈ కోర్సుల పట్లే ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది పీజీఈసెట్‌కు 26,005 మంది దరఖాస్తు చేసుకోగా, దీంట్లో 10,006 దరఖాస్తులు(40%) ఒక్క కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుకే వచ్చాయి. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని సబ్జెక్టులకు చాలా తక్కువ దరఖాస్తులొచ్చాయి. టెక్స్టైల్ టెక్నాలజీకి 10, నానో టెక్నాలజీకి 55, మెటలర్జికల్ ఇంజినీరింగ్‌కు 25, మైనింగ్ ఇంజినీరింగ్‌కు 75, జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మెటిక్స్కు 56, ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌కు 69, బయోమెడికల్ ఇంజినీరింగ్‌కు 47, బయోటెక్నాలజీకి 76, కెమికల్ ఇంజినీరింగ్‌కు 86 చొప్పున దరఖాస్తులొచ్చాయి. పీజీఈసెట్ హాల్‌టికెట్లను మంగళవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు తెలిపారు.