హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రతినెల వేతనాలు చెల్లించాలని, ఇప్పటికే మూడునెలలు వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హెచ్‌ఆర్‌పాలసీ కింద తమకు టైపిస్ట్ పేస్కేల్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. శుక్రవారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఆ సంఘం నాయకులు ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ) కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ)లోని 92వేల పైచిలుకు ఉద్యోగులకు గ్రీన్‌చానల్ ద్వారా వేతనాలు ఇస్తామని మంత్రి సీతక్క చెప్పి నాలుగు నెలలైనా.. ఇప్పటివరకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.