వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో సంభవిస్తున్న ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే దేశంలో సమగ్ర సాగు ఎంతో మేలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఉప కులపతి అల్దాస్ జానయ్య (Aldas Janaiah) అన్నారు. దేశంలో దాదాపు సగానికి పైగా రైతులు వ్యవసాయ ఆధారిత రంగాలపైనే ఆధారపడి ఉన్నారని, ఇప్పటికీ మూస పద్ధతిలోనే సాగు కొనసాగుతున్నదని చెప్పారు. ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తరుగుతున్న కమత విస్తీర్ణం, నిలకడ లేని దిగుబడులు, పెరుగుతున్న సాగు వ్యయం వల్ల రైతులు అధికంగా దెబ్బతింటున్నారని తెలిపారు. దీంతో వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గుతుందన్నారు. వ్యవసాయంలో సంభవిస్తున్న ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, సమగ్ర సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
దేశంలో చిన్న సన్నకారు రైతులు స్థానికంగా ఉన్న వనరులను అనుసరించి వ్యవసాయంతో పాటు, అనుబంధ రంగాలైన పాడి పశువులు కోళ్లు ఉద్యాన పంటలు, పశుగ్రాసాల సాగు చేపల పెంపకం పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి అటవీ తదితర కచ్చితమైన ఆదాయం పొందవచ్చు అన్నారు. భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు అన్నారు ఈ పద్ధతిలో ఒక వ్యవస్థ నుంచి లభించే ఉత్పత్తులు వ్యర్థాలు మరో వ్యవస్థకు దాన ఎరువుగా వాడుకుంటూ అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు ఖరీఫ్, రబీ పంటలతో పాటు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని, ఖచ్చితమైన ఆదాయం పొందవచ్చునారు. ఒక హెక్టార్ 70 శాతం సాగు భూమిలో వివిధ రకాల పంటలు 20 శాతం సాగు భూమిలో ఉద్యాన పంటలు 10 శాతం భూమిలో పశువులు జీవాలు కోళ్లకు సెట్టు కంపోస్టు వర్మి కంపోస్టు పెరటి తోటలు వంటివి చేపడితే,ఎకరాకు దాదాపు 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చు అన్నారు.
పాలు, గుడ్లు, కూరగాయలు ఉపయోగించడం వలన కుటుంబ సభ్యులకు పౌష్టిక ఆహారాన్ని అందించవచ్చు అన్నారు. రైతులకు అధిక పోషణ, మంచి సమతుల్యమైన ఆహారం లభ్యమవడంతో పాటు, శక్తి పెరిగి ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందన్నారు. మన యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఏరువాక కృషి విజ్ఞాన కేంద్రాలు విస్తరణలో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల పరిజ్ఞానాన్ని శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతుల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రస్తుత అనిశ్ఛిత వాతావరణ పరిస్థితుల్లో విధిగా సమగ్ర వ్యవసాయం చేపడుతూ భూమిని సగం రక్షిస్తూ అధిక ఆదాయం పొందాలని ఆయన సూచించారు.