Kutumba Survey | పెద్ద కొడప్గల్, నవంబర్ 11: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం పెద్దదేవిసింగ్ తండావాసులు.. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేశారు. విషయం తెలిసి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం తండాకు వచ్చి స్థానికులతో మాట్లాడారు. సర్వేను ఎందుకు నిలిపేశారని, సర్వేకు సహకరించకపోతే నష్టపోతారని చెప్పారు. దీంతో తండావాసులు సర్వే ఫారంలో మథుర లంబాడా అని లేదని, మరి ఏ కులం పేరుతో సర్వే చేసుకోవాలని సబ్ కలెక్టర్‌ను ప్రశ్నించారు.
ఫారంలో 240 కులాలు ఉన్నాయని, ఆ జాబితాలో తమ కులం ఎందుకు లేదని చెప్పారు. తమ జాతిని ప్రభుత్వం మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబితాలో 240 కులాలను చేర్చినట్టే తమ కులాన్ని కూడా చేర్చి ఉంటే సర్వేకు సహకరించే వాళ్లమని స్పష్టంచేశారు. సర్వే ఫారంలో మధుర అని ఉందని, కానీ మథుర లంబాడా, కాయితీ లంబాడా, లబానా లంబాడా అని ఉంటే సర్వే చేసుకునేవారమని తెలిపారు. వేరే కులం పేరుతో సర్వేలో తమ వివరాలు నమోదుచేస్తే తమ కులమే తొలగిపోతుందని, ఇప్పటికే తమను ఎస్టీల జాబితా నుంచి తొలిగించడంతో తాము చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేకు సహకరించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సర్దిచెప్పగా.. తండావాసులు వినిపించుకోలేదు. దీంతో ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడుతానని చెప్పి ఆమె వెనుదిరిగారు.