Yadadri Power Plant | దామరచర్ల, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తలపెట్టిన బృహత్తరమైన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్న ప్లాంట్‌ను నేడు మంత్రులు ప్రారంభించనున్నారు. దక్షిణాదిలో అతిపెద్దదైన నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్ మొదటి, రెండో యూనిట్ల నుంచి పూర్తిస్థాయిలో కాంతులు విరజిమ్మనుంది. ప్లాంటుకు అనుసంధానంగా రైల్వేలైన్లు పూరి ్తకావడంతో రామగుండం నుంచి బొగ్గు వ్యాగన్‌తో పాటు మొదటి యూనిట్ సింక్రనైజేషన్‌ను మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్లాంట్ ద్వారా తెలంగాణకు 1600 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది.
కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కరెంట్ కష్టాలతో విలవిల్లాడింది. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడితే చీకట్లు తప్పవని నాటి పాలకులు భయపెట్టారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విద్యుత్ కష్టాలు తొలగించడంలో భాగంగా కేసీఆర్ పలు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2015 జూన్ 8న యాదాద్రి పవర్ ప్లాంట్‌కు కేసీఆర్ భూమిపూజ నిర్వహించారు. రూ.30వేల కోట్లతో 4000 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణ బాధ్యతలను బీహెచ్ఈఎల్కు అప్పగించారు. 5 ప్లాంట్ల పనులు అక్టోబర్ 2017లో ప్రారంభమయ్యాయి. 5,668 ఎకరాల భూమి సేకరించగా, 4,676 ఎకరాలు అటవీ భూమి ఉంది. ఇందులో 702.29 ఎకరాల్లో ఎంక్రోచర్స్ సాగు చేసుకునేవారు. వారికి కేసీఆర్ ఎకరానికి రూ.6 లక్షలు పరిహారం అందించారు. ఇలా ఒక్కో ఆటంకాన్ని అధిగమిస్తూ పనులు సాఫీగా సాగేలా చూశారు.
నీరు, బొగ్గు కోసం చర్యలు
విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన నీటిని కృష్ణా నది నుంచి తీసుకునేలా అనుమతులు పొందారు. నది నుంచి పైపులైన్ ఏర్పాటు చేశారు. బొగ్గు రవాణా కోసం సమీపంలో జాన్‌పహాడ్ రైల్వే క్రాసింగ్ నుంచి ప్లాంట్ వరకు రైల్వే లైన్ నిర్మించారు. రూ.100 కోట్ల వ్యయంతో 8కి.మీ రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి.
సవాళ్లను దాటుకుంటూ
కరోనా సమయంలో 10వేల మంది కార్మికులు తమతమ రాష్ర్టాలకు వెళ్లిపోవడంతో ప్లాంట్ పనులు రెండేండ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, పనుల్ని తిరిగి పట్టాలెక్కించింది. కేసీఆర్ హయాంలోనే పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కానీ కొందరు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు వేయడంతో ఉత్పత్తికి అడ్డంకి ఏర్పడింది. అడ్డంకులు తొలగిపోవడంతో ఇప్పుడు ఉత్పత్తికి మార్గం సుగమమైంది.