Anjaiah Yadav | ఒకప్పుడు ఆయన మాలీపటేల్. ప్రజా సమస్యలను దగ్గరగా చూశారు. సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని చూశారు. బస్సు కిరాయిలకు డబ్బులు ఇచ్చేవారు. రెవెన్యూ స్టాంప్ పేపర్లను ఉచితంగా అందజేశారు. మంచినీటి కోసం బాధపడుతున్న వారిని చూసి, సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పించారు. ప్రజల్లో ఒకడిగా ఆడుతూ.. పాడుతూ.. ప్రజల పక్షాన నిలుస్తున్నారు యెల్గనమోని అంజయ్య యాదవ్.
ఎమ్మెల్యే యెల్గనమోని అంజయ్య యాదవ్ కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలో పుట్టారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రామానికి వచ్చిన మాలీ పటేల్‌గా విధుల్లో చేరారు. గ్రామస్తులకు ఎన్నో సేవలను అందించారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ సారథి కేసీఆర్ ఇచ్చిన పిలుపునందుకొని 2001లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం కేశంపేట జడ్పీటీసీగా విజయం సాధించారు. తెలంగాణ సత్తాను చవిచూపించారు. సీమాంధ్రులు అధికంగా ఉన్న షాద్‌నగర్ తాలూకాలో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. హ్యాట్రిక్ విక్టరీ కోసం తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
సేవలో మేటి..
ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్.. పటేల్‌గా ఉన్నప్పుడు ప్రజలు పడుతున్న బాధలను చూశారు. సేవ చేయాలనుకున్నారు. ఎండాకాలంలో షాద్‌నగర్ పట్టణంతో పాటు, పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీళ్లను అందించేవారు. కరోనా సమయంలో ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు, మందులను పంపిణీ చేశారు. ఆలయాల నిర్మాణానికి విరాళాలు అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మూడుసార్లు మెగా జాబ్ మేళా నిర్వహించారు.
సంస్కృతికి పట్టం..
ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రజలతో మమేకమై ఉంటారు. నేటికీ ఆయన సొంత గ్రామంలో రచ్చకట్టపై కూర్చొని ప్రజలతో మాట్లాడుతారు. పండుగలు, పబ్బాలకు జనంతో కలిసి ఆడి పాడుతారు. భజనలు చేస్తారు. కోలాటం ఆడుతుంటారు. వాళ్ల సంస్కృతిలో భాగంగా గొల్ల కులస్తులు చేసే పండుగలను ప్రతియేటా చేస్తారు. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు.