దుబ్బాక, జూన్25: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగంచేసిన దుబ్బాక ప్రాంత రైతుల పంటపొలాలకు సాగునీటిని సరఫరా చేసి, వారి కన్నీళ్లను తుడవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం రైతులు నిర్వహించిన జలసాధన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దుబ్బాక రైతుల త్యాగ ఫలితంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తే.. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు సరఫరా చేయకుండా రైతులను కన్నీళ్లు పెట్టించడం దారుణమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో ఇర్కోడు వద్ద హైలెవల్ ప్రాంతాలకు ఎత్తిపోతల పైపులైన్ పథకం ద్వారా సాగునీటిని అందించాల్సి ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిన్నపాటి పనులు పూర్తికావడం లేదని మండిపడ్డారు.
పెండింగ్ పనుల పూర్తిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పలుమార్లు విన్నవించినా ఫలితం రాలేదని తెలిపారు. ఈ ప్రాంత రైతుల త్యాగాలను విస్మరించి కాంగ్రెస్ సర్కారు మల్లన్నసాగర్ నుంచి పక్కనున్న హైదరాబాద్, ఇతర జిల్లాలకు నీటి సరఫరా చేయడమేమిటని ప్రశ్నించారు. దుబ్బాక రైతులకు సాగు నీరందించాకే, ఇతర ప్రాంతాలకు ఈ నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో నీటి ఉద్యమం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు. దుబ్బాక రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తన ఎమ్మెల్యే పదవిని తాగ్యం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.