హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ముఖ్యంగా కాజీపేట జంక్షన్, కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ను (భద్రాచలం రోడ్) డివిజన్ కేంద్రాలుగా ప్రకటిస్తూ అభివృద్ధి చేయాలని తెలంగాణ ఎంపీలు సూచించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ సభ్యుల వార్షిక సమావేశం గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటకకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పలు కీలక ప్రతిపాదనలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే జోనల్ కేంద్రం కాగా, హైదరాబాద్ ఒకటే డివిజన్‌గా ఉన్నదని, కాబట్టి కాజీపేట, కొత్తగూడెంను డివిజన్లుగా ప్రకటించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.
బ్రిటిష్ కాలంలో 1932లో కొత్తగూడెం రైల్వేస్టేషన్ ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. సుమారు 150 ఏండ్ల చరిత్ర కలిగిన కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్కు 2,500 మంది సభ్యులు ఉన్నప్పటికీ ప్రస్తుతం భవనం, ఇతర సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని ఎంపీ వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తనతో పాటు పార్థసారథిరెడ్డి, రేణుకా చౌదరి, రఘురామిరెడ్డి, బలరాంనాయక్ మొత్తంఐదుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పారు. ఈ జిల్లాలో రైల్వే శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి తాము పలుమార్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లామని, ఈ మార్గాన్ని భద్రాచలం వరకు పొడిగిస్తూ, భవిష్యత్తులో దానిని 5 రాష్ట్రాలకు కూడలిగా తీర్చిదిద్దాలని, భక్తజనుల సౌకర్యార్థం ఇకడి నుంచి తిరుపతికి రైళ్లు నడుపాల్సిందిగా కోరారు.
అనంతరం శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు. మలాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్ల నవీకరణ, ఆధునీకరణ పనులను పూర్తిచేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌రెడ్డి కోరారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అనిల్‌కుమార్, వేం నరేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డాక్టర్ కడియం కావ్య, వంశీకృష్ణ, కుందూరు రఘువీర్‌రెడ్డి, ఆర్ రఘురామిరెడ్డి, సురేశ్ షెట్కార్, బలరాంనాయక్, నగేశ్, డీకే ఆరుణ, బస్తిపాటి నాగరాజు, కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.