త్వరలో టీచర్లకు ప్రమోషన్లు
- సర్వీస్ రూల్స్‌లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ
- వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతి త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. నిరుద్యోగులకు సంబంధించి బుధవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడించారు. వనపర్తిలో రూ.51.70 కోట్ల నిధులతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని మంగళవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా వనపర్తికి పలు వరాలు ప్రకటించారు. వనపర్తి పట్టణానికి రూ.కోటి, జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీకి రూ.50 లక్షలు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరుచేశారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఉద్యోగుల జీవితాలు మారిపోయినయ్
తెలంగాణ సోషియో ఎకనమిక్ సర్వేను అసెంబ్లీలో పెట్టినం. దేశంలోనే అనేక విషయాల్లో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉన్నది. ఒకప్పుడు మనకు కరెంటు ఎప్పుడొస్తదో తెలిసేది కాదు. ఈరోజు తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణది నంబర్ వన్ ప్లేస్. తలసరి ఆదాయంలో, జీఎస్డీపీ వృద్ధిరేటులో ముందువరుసలో ఉన్నది. దేశంలో ప్రతి ఇంటికీ నల్లాతో నీళ్లిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇదంతా మాయా మశ్చీంద్ర చేస్తేనో, నిరంజన్‌రెడ్డి చెయ్యి ఊపితేనో, శ్రీనివాస్‌గౌడ్ చెయ్యి ఊపితేనో రాలేదు. కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలనుకొనే యజ్ఞంలో ఉద్యోగులంతా భాగస్వాములైనరు కాబట్టి సాధ్యమైంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల జీవితాలు మారిపోయినయ్. ఉద్యోగులకు ఉత్తమమైన సర్వీస్ రూల్స్‌ను దేశానికే ఆదర్శంగా రూపొందిస్తాం. ఉపాధ్యాయుల ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని మంత్రిని కోరుతున్న. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ రోజు అతనికి అందాల్సిన అన్ని బెనిఫిట్లు చేతిలో పెట్టి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా దించిరావాలి. సీఎస్ సోమేశ్‌కుమార్ చర్యలు తీసుకోవాలి.
మహారాష్ట్ర కంటే మన తలసరి ఆదాయమే ఎక్కువ..
యావత్ దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. 50 ఏండ్ల నుంచి ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ర్టాల కంటే కూడా తెలంగాణ ఎన్నో విషయాల్లో అగ్రగామిగా ఉన్నది. ఫైనాన్షియల్ కాపిటల్ ఆఫ్ ఇండియా అయిన ముంబై ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మన తలసరి ఆదాయమే ఎక్కువ. ఇదంతా ఉద్యోగుల కృషి.
ఉషారెడ్డి.. తెలంగాణ ప్రతిభకు నిదర్శనం
తెలంగాణలో అద్భుతమైన శక్తి దాగుందని చెప్పడానికి ఉషారెడ్డి ఒక నిదర్శనం. సమీకృత కలెక్టరేట్ భవనాల ఆర్కిటెక్చర్ ఆమె. పక్కా తెలంగాణ బిడ్డ. మన భువనగిరిలోనే పుట్టింది. మన కలెక్టరేట్లు కొన్ని రాష్ర్టాల సెక్రటేరియట్లకంటే అద్భుతంగా ఉన్నాయి. మా తెలివి ఎట్ల ఉంటది అంటే ఉషారెడ్డిలా ఉంటది. మా తెలివి ఎట్లుంటది అంటే వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్లా ఉన్నది. రేపు రాబోయే అద్భుతమైన మెడికల్ కాలేజీలా ఉన్నది. సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్థానికులకు ఉద్యోగాలు
సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు నెలలో 31వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించనున్నదని చెప్పారు. కొత్త నియామకాల్లో గద్వాల, వనపర్తి, ములుగు జిల్లాల్లో స్థానికులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనుసరించి ఉద్యోగాలు వస్తాయన్నారు. సమావేశంలో ఎంపీలు రాములు, మన్నెం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జడ్పీ చైర్మన్లు లోక్‌నాథ్‌రెడ్డి, సరిత, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆశీష్ సెంగ్వాన్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు.
నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో ప్రకటన చేస్తా
- ఉదయం 10 గంటలకు అంతా టీవీలు చూడండి
నిరుద్యోగ యువ సోదరుల కోసం రేపు పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేయబోతా ఉన్నా. రేపు 10 గంటలకు అందరూ టీవీలు చూడండి. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో.. ఏం
ప్రకటన చేయబోతున్నామో చెప్తాను. అణువణువునా తెలంగాణ జీర్ణించుకున్నం. రక్తంలో, శరీరంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా.. చివరి రక్తపు బొట్టు దాకా.. తెలంగాణ ప్రగతి కోసమే ఉంటది తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదు. ఆ పద్ధతిలోనే ఇవాళ పాలమూరు అద్భుతాలు ఆవిష్కరించింది. నిరంజన్‌రెడ్డి కావచ్చు.. గద్వాల కృష్ణమోహన్‌రెడ్డి కావచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. అందరూ కూడా అదే చేశారు.
రాబోయే పదేండ్లకు సరిపడా కరెంటు
తెలంగాణ వచ్చే ముందు అందరూ మనల్ని భయపెట్టారు. రాష్ట్రం చిమ్మ చీకటైపోతదని భయపెట్టినరు. కానీ ప్రస్తుతం.. నిమిషం కూడా కరెంటు పోతలేదు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్తు ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తేనే ఇదంతా సాధ్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సుమారు తొమ్మిది, పదికోట్ల మందికి విద్యుత్తు అత్యధిక వినియోగం 13,600 మెగావాట్లు. ప్రస్తుతం తెలంగాణలో పాత పది జిల్లాల్లోనే 14 వేల మెగావాట్ల విద్యుత్తు అందిస్తున్నం. ఇంకా 14 వేల మెగావాట్ల విద్యుత్తు కావాలన్నా ఇస్తమని ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అంటున్నరు. రాబోయే పదేండ్లకు సరిపడా కరెంటు సిద్ధంగా ఉన్నదని చెప్తున్నరు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

