హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): వర్షాకాలానికి ముందే యంత్రాంగం అన్నీ సిద్ధం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నాలా లు, డ్రైనేజీ కాలువల్లో బురద తీసే పనులను మే 31 నాటికి పూర్తి చేయాలని సూచించింది. టెండర్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నది. వేసవిలోనే పనులన్నీ పూర్తి చేస్తే వర్షాకాలంలో ఇబ్బందులు ఉండవని చెప్పిం ది. ఈ పనుల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.
జూన్ 1 నుం చి అక్టోబరు 31 వరకు అత్యవసర బృందాలు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కమిషనర్లకు సూచించింది. పూడిక, బురద తొలగించడానికి గుర్తించిన నాలాలు, డ్రైనేజీల సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. కల్వర్టుల్లో ప్రజలు చెత్త, వ్యర్థాలను వేయకుండా జాలిలను ఏర్పాటు చేయాలని సూచించింది. పనుల ప్రారంభానికి ముందు, తర్వాత తప్పనిసరిగా ఫొటోలు తీసి వాటిని భద్రపర్చాలని, వాటిని బిల్లు ఫైల్లో పెట్టాలని పేర్కొన్నది.