హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): వందల కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయినా తమకేం సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం విస్మయానికి గురిచేస్తున్నది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేస్తున్నారు. తప్పు చేసి విచారణ జరపాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విమర్శలకు తావిస్తున్నది. మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర పరిధి నుంచి దాటించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పదే పదే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకం ప్రకారమే జరిగిందని మీడియా ఎదుట గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆడుతున్న డ్రామా రక్తికట్టిస్తున్నది. గత నాలుగు రోజుల్లో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే..
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని కూడా పక్కదారి పట్టించేందుకే బీజేపీ కొత్త పాట అందుకొన్నదని స్పష్టం అవుతున్నది. రాష్ట్ర పోలీసుల నుంచి ఆధారాలు, ఆడియోలు, వీడియోలు తీసుకొని మాయం చేయడానికే బీజేపీ నేతలు సీబీఐ, ఈడీ అంటూ డ్రామాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బండి సంజయ్ వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేసిన ఆయన.. ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కూలదోయడంలో బీజేపీ ప్రమేయం లేదని మోదీతో ప్రమాణం చేయిస్తావా? అని టీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు నిలదీస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ డిమాండ్.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రాష్ట్ర సీఈసీకి బీజేపీ లీగల్ విభాగం ఫిర్యాదు.