హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వశాఖల్లో అవినీతి అధికారులు, ఉద్యోగులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతి పనికీ చేయి చాచడం కొందరు అధికారులకు అలవాటుగా మారిందని బాధితులు చెప్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో కొందరు పెద్దలు కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో అదేబాటలో అధికార యంత్రాంగం రెచ్చిపోతున్నదని మండిపడుతున్నారు. వివిధ పనుల కోసం ఆశ్రయిస్తే ‘నాకేంటి?’ అంటూ వేధిస్తున్నారని చెప్తున్నారు. ప్రతీ పనికి ఓ రేటు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ముక్కుపిండి లంచాలు డిమాండ్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వేధింపులు భరించలేక కొందరు ప్రజ లు ఏసీబీని ఆశ్రయిస్తుంటే మరికొందరు బాధితులుగానే మిగిలిపోతున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్నది కొందరైతే గుట్టుచప్పుడు కాకుండా జనాలను పీడిస్తున్నవారు మరికొందరు. ఈ నేపథ్యంలో ఏసీబీని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగింది.
ప్రభుత్వంలోని కీలకశాఖలు అవినీతికి అడ్డాలుగా మారాయి. ముడుపుల మురికిలో మునిగిపోతున్నాయి. అందుకు ఏసీబీ నమోదుచేసిన కేసులే ఉదాహరణ. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రెవెన్యూశాఖలో సుమారు 25 కేసులు, పంచాయతీరాజ్‌శాఖలో 19 కేసులు, పోలీస్‌శాఖలో 16 కేసులు, పురపాలకశాఖలో 11 కేసులను ఏసీబీ నమోదు చేసింది. హైదరాబాద్ నగరశివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నివాస ప్రాంతాలు విస్తరించడం, భవన అనుమతులు, ఎల్ఆర్ఎస్, ఓసీలు, లైసెన్సులు పొందడం వంటి అంశాల్లో అవినీతి ఎక్కువ చోటుచేసుకున్నది. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు ఏసీబీ దాడుల ద్వారా తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఆన్లైన్లో సింగిల్ విండోలో అనుమతులు ఇచ్చేవారు. దాంతో ప్రజలు పెద్దగా అధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పర్మిషన్లకు వివిధ అంచెలు పెరిగాయి. ఒక ఇంటి నిర్మాణానికి చాలా ఎన్వోసీలు సమర్పించాల్సి రావడం, దానిని అసరాగా చేసుకొని అధికారులు, ఉద్యోగులు ఎవరి స్థాయిలో వాళ్లు వసూళ్లకు పాల్పడటం సాధారణంగా మారింది.
కొన్ని మున్సిపాలిటీల్లో అధికారులు ఏజెంట్లను నియమించుకొని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెంట్లను కలిస్తే తప్ప ఫైల్ ముందుకు కదలని పరిస్థితులు ఉన్నాయని బాధితులు చెప్తున్నారు. ఇల్లు, భవనం, అపార్ట్మెంట్.. ఇలా నిర్మాణస్థాయిని బట్టి లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారని తెలుస్తున్నది. అధికారులు, ఉద్యోగుల వేధింపులతో విసిగివేసారిపోతున్న ప్రజానీకం.. ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని తెలుస్తున్నది. ఏ ఉద్యోగి అయినా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్‌చేయాలని అవినీతి నిరోధకశాఖ కోరుతున్నది. 9440446106 నంబర్ ద్వారా వాట్సాప్‌లో, acb.telangana. gov.in ద్వారా వెబ్సైట్లో, ఇతర సోషల్ మీడియా యాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.