బడంగ్‌పేట, జనవరి 19: రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో శుక్రవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. కబ్జా కథనంపై స్థానికంగా రోజంతా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కథనం చక్కర్లు కొట్టింది. దీంతో స్పందించిన తాసిల్దార్ మాధవీరెడ్డి చెరువు శిఖంను కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఒక్క రెవెన్యూ అధికారులది మాత్రమే కాదని, చెరువులను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ఇరిగేషన్ అధికాలపై ఉన్నదని పేర్కొన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే మున్సిపల్ అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా విద్యుత్తు అధికారులు మీటర్లు జారిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
మీటరు కోసం దరఖాస్తు చేసిన తర్వాత విద్యుత్తు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వెల్లడించారు. మీటర్ కోసం ఇండ్ల పట్టాలు, నోట్రీలు ఇస్తే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక నుంచి ఏదీ పరిశీలించకుండా మీటర్లు ఇవ్వొద్దని విద్యుత్తు అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి చందన చెరువు కబ్జా స్థలంలో నిర్మించిన ఇండ్లకు ఇచ్చిన మీటర్లు రద్దు చేస్తామని విద్యుత్తు అధికారులు చెప్పారని వివరించారు.
మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు ఇచ్చే ముందు పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటి నంబర్ ఇవ్వొద్దని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. చెరువుల అంశంపై ఇరిగేషన్ అధికారులకు లేఖ రాశామని తెలిపారు. చందన చెరువు శిఖ భూమిపై సర్వే చేయిస్తామని, నఖిలీ పత్రాలు సృష్టించి చెరువు భూములను కాజేయాలని చూసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.