హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచితంగా నాలుగేండ్ల ఈ కార్ రేస్ ఒప్పందాన్ని రద్దుచేయడం వల్ల తెలంగాణకు వచ్చే వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో గండిపడిందని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రాకుండా పోయా యని విమర్శించారు. తెలంగాణకు వచ్చే కోట్ల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన రేవంత్‌రెడ్డిపై, తెలంగాణ బిడ్డగా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో భారత న్యాయ సంహిత 316, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్‌కు మార్రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు చిరుమిళ్ల రాకేశ్‌కుమార్, వాసుదేవరెడ్డితో కలిసి ఠాణాలో ఫిర్యాదు అందజేశారు.
ఫిర్యాదు ఇచ్చేందుకు తెలంగాణభవన్ నుంచి బయల్దేరే ముందు, ఫిర్యాదు ఇచ్చిన అనంతరం ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం ఈ రాష్ర్టాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి.. హైదరాబాద్‌ను ఈవీ మొబిలిటీ వ్యాలీగా మార్చాలి.. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. ఆ రేసు ఇంకా నాలుగుసార్లు జరగాల్సి ఉండె. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచితంగా ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఫలితంగా ఈవీ మొబిలిటీ వ్యాలీ రాకుండా పోయింది. పన్నులు చెల్లించే పౌరుడిగా నాకు నష్టం జరిగింది. తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం పోయింది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి. అందుకే ఈ కేసులో ముందు రేవంత్‌రెడ్డిని కూడా ప్రశ్నించాలి’ అని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, అవినీతి జరిగిందని ప్రజలకు అబద్దాలు చెప్పి, వేల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు తెచ్చిన ప్రజా ప్రయోజన పథకాలను రద్దు చేయలేదని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి రద్దుచేస్తూ పోవడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ్దంగా పరిపాలిస్తానని ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి నేడు తన సోదరులకు అధికార లాంఛనాలతో స్వాగతం పలుకుతూ రాచమర్యాదలు చేయిస్తున్నారని విమర్శించారు. తన మంత్రివర్గ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఫైరయ్యారు. హోం మంత్రి, సీఎం అని రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టకుండా చూడొద్దని పోలీసులను కోరారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే అనే నిబంధనను మరువద్దని, మీరు పట్టించుకోకపోతే న్యాయస్థానం ఉన్నదనే విషయం మరువద్దని హితవుపలికారు. సమావేశంలో అభిలాష్, విజయ్‌కుమార్, విజయ ఆరియా పాల్గొన్నారు.