సుల్తాన్‌బజార్, డిసెంబర్ 21: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై హైదరాబాద్ నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మాలల మనోభావాలను కించపర్చారని ఆరోపిస్తూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ అప్పలనాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాంపల్లిలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్‌కు ఇదే కేసును బదిలీ చేసినట్టు నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల రెండు, నాలుగో తేదీల్లో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మాలలను దూషిస్తూ దుర్భాషలాడారని రాంప్రసాద్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్న మందకృష్ణపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు సీహెచ్ అరుణ్‌కుమార్, ఎం మణిదీప్, ఎం వెంకటస్వామి, జీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.