హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కారాలయాల్లో ఫిర్యాదులు, వినతుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని పేర్కొంటూ గతంలో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు స్పష్టం చేసింది.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికాలకు సూచించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కేపీహెచ్‌బీకి చెందిన పీ రమ్యశ్రీ మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 కార్యాలయ సిబ్బందిపై విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌ను, దాన్ని పరిశీలించి వారంలోగా తగిన ఉత్తర్వులు జారీచేయాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేశారు.