హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : అనేక మలుపులు తిరుగుతున్న డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా బాధిత అభ్యర్థులు ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ, విజిలెన్స్‌కు ఫిర్యాదుచేశారు. ఈ కోటా టీచర్ల భర్తీలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు.
రీ వెరిఫికేషన్ ఫలితాలను ఇంకా ప్రకటించలేదని, 13 నెలలుగా 33 మంది ఉద్యోగాలను దర్జాగా అనుభవిస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. మెదక్, నారాయణపేట జిల్లాల్లో జాతీయ క్రీడాకారులకు పోలీసు ఉద్యోగాలిచ్చారని, టీచర్ పోస్టులను మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. వికారాబాద్, హనుమకొండ జిల్లాల్లో క్రీడా కోటా అభ్యర్థులు క్రీడా సర్టిఫికెట్లను సమర్పించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. పూర్తి విచారణ జరిపి 97 మందికి న్యాయం చేయాలని కోరినట్టు సామాజిక కార్యకర్త నీలం రవి తెలిపారు. ఇదే విషయంపై డీవోపీటీ, ప్రధాని కార్యాలయానికి సైతం ఫిర్యాదు పంపామని పేర్కొన్నారు.
ముగిసిన గడువు.. కొలిక్కిరాని ఎడ్యుకేషన్ పాలసీ ; అక్టోబర్ 30 వరకే సిద్ధం చేయాలన్న ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని సిద్ధం చేసేందుకు ప్రభుత్వం.. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు నేతృత్వంలో అత్యున్నతస్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను సభ్యులుగా నియమించి అక్టోబర్ 30లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. అయితే, ఈ గడువు గురువారం ముగిసిందే కానీ నివేదిక మాత్రం సిద్ధం కాలేదు. పలు అంశాలపై సబ్‌కమిటీలను సైతం ఏర్పాటుచేయగా, ఇవి ఇంకా భేటీ అవుతూనే ఉన్నాయి. అయితే, నవంబర్ చివరికల్లా పూర్తి నివేదికను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వమున్నట్టు తెలుస్తున్నది.