Justice Chandrakumar | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్, బోర్డుతో మాట్లాడేందుకు అవగాహన లేని వ్యక్తులను ప్రభుత్వం పంపడంతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో ‘ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ‘కృష్ణా నదీ జలాలు, సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణా నది సమగ్ర స్వరూపం గురించి అవగాహన లేని అధికారులు కేంద్రం ముందు ఎలా వాదనలు వినిపిస్తారని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ జల వివాదంపై బోర్డు ఏర్పాటు చేసినా.. ఎనిమిదేండ్ల నుంచి కొత్త ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సమర్థులైన ఇంజినీర్లను కేంద్రం వద్దకు పంపి రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై రిప్రజెంటేషన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాల పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ‘రెండు రాష్ర్టాలు- రెండు కండ్లు’ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్నారని.. ఆయనను కాదని కృష్ణా జలాల పంపిణీపై ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరహాలో మనకు హక్కుగా రావాల్సిన నీటి కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, విజయపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ ఆర్ రమేశ్‌రెడ్డి, పాడూరి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.