హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కరెంట్ పోయిందంటే వినియోగదారులు డిస్కం నుంచి పరిహారం పొందవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. నగరాలు, పట్టణాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు కరెంట్ పోతే ఒక వినియోగదారుడికి డిస్కంలు రూ.200 పరిహారం చెల్లించాలని నిబంధనలు చెప్తున్నాయి. ఒకే అపార్ట్మెంట్, కాలనీలో కరెంట్ పోతే ఎంతమంది బాధితులుంటే అంత మందికి ఒక్కో వినియోగదారుడికి రూ. 100 చొప్పున పరిహారం చెల్లించాలి. పట్టణాలు, నగరాల్లో 8 గంటలలోపు అయితే ఒక కనెక్షన్‌ను రూ. 200, ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే కనెక్షన్‌కు రూ. 100 చొప్పున పరిహారం చెల్లించాలి.
బిల్లు, పెండింగ్ బిల్లులు చెల్లించిన త ర్వాత కూడా కనెక్షన్ కట్ చేస్తే రోజుకు రూ. 200 పరిహారంగా డిస్కంలు చెల్లించాల్సి ఉం టుంది. విద్యుత్తు చట్టం 2003 సెక్షన్ 176 ప్రకారం విద్యుత్తు వినియోగదారుల హక్కుల ను కేంద్రం ప్రకటించింది. పంపిణీ సంస్థలు ఉద్దేశపూర్వకంగా విద్యుత్తు అంతరాయం కల్పించొద్దని తెలిపింది. ఇందుకు వినియోగదారులు పరిహారం పొందే హక్కును కలిగి ఉంటారని కేంద్రం పబ్లిక్ నోటీస్‌లో వెల్లడించింది. 24 గంటల నిరంతర విద్యుత్తు వినియోగదారుల హక్కు అని పేర్కొన్నది. కొత్త కనెక్షన్లు, కనెక్షన్ తొలగింపు, లోడ్ మార్పు, వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కేంద్రం నిర్దిష్ట గడువును విధించింది. ఈ సేవలను అందించడంతో జాప్యం జరిగితే డిస్కంలు పరిహారం చెల్లించాలని స్పష్టంచేసింది.
అవసరమైన చార్జీలు చెల్లించిన తర్వాత నెట్వర్క్ విస్తరించకపోయినా, అవసరమైన మేరకు విద్యుత్తు సరఫరా చేయకపోయినా డిస్కంల నుంచి వినియోగదారులు పరిహారం పొందవచ్చు. ఎల్టీ కనెక్షన్లకు 30 రోజుల్లోపు అయితే రోజుకు రూ. 200, 11కేవీ వినియోగదారులకు 45 రోజుల్లోపు అయితే రోజుకు రూ. 400, 33కేవీ వినియోగదారులకు 60రోజుల్లోపు అయితే రోజుకు రూ.1,000, ఎక్స్ట్రా హైటెన్షన్ వినియోగదారులకు 180రోజుల్లోపు అయితే రోజుకు రూ.1,000, ఈఆర్సీ విధించిన గడువులోపు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయకపోతే రోజుకు రూ. 2,000 చొప్పున పరిహారం పొందవచ్చు.
విద్యుత్తు కనెక్షన్ ఓనర్షిప్ ఒకరి నుంచి మరొకరికి బదిలీ కోసం విజ్ఞప్తులు రావడం సర్వసాధారణం. నిర్దిష్ట గడువులోపు ఓనర్‌షిప్‌ను బదిలీ చేయకపోతే డిస్కంలు పరిహారం చెల్లించాల్సిందే. 7 రోజుల్లోపు బదిలీ చేయకపోతే రోజుకు రూ. 200, 7 రోజుల్లో క్యాటగిరి మార్పు చేయకపోతే రోజుకు రూ.200, 30 రోజుల్లో ఎల్టీ-1 సింగిల్ ఫేజ్ నుంచి ఎల్టీ-3 త్రీఫేజ్‌కు మార్చకపోతే రోజుకు రూ.200 చొప్పున పరిహారం పొందవచ్చు. 60 రోజుల్లోపు ఎల్టీ నుంచి హెచ్టీకి, హెచ్‌టీ నుంచి ఎల్టీకి మార్చకపోతే రోజుకు రూ. 400 చొప్పున పరిహారాన్ని డిస్కంలు చెల్లించాలి.