హైదరాబాద్ : గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి న్యాయపరంగా పరిహారం ఇప్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో గణపురం రిజర్వాయర్ ముంపు రైతులతో మంత్రి మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకే రిజర్వాయర్ గా ఏర్పాటు చేస్తున్నామని, రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.
ఏడువందల ఏళ్ల తర్వాత పునరుద్దరణ, సామర్ద్యం పెంచుతున్నామని పేర్కొన్నారు. గణపసముద్రం రిజర్వాయర్ గా మార్చడం ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రిజర్వాయర్ గా ఏర్పాటు చేయడంతో వ్యవసాయ సాగుతో పాటు మత్స్యసంపద పెద్దమొత్తంలో పెరిగి వేల మందికి అదనపు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
గణపురం శివారులో 580, వెంకటాంపల్లి శివారులో 21 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరిస్తున్న వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.