Congress Govt | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కొన్ని సాధారణ ప్రభుత్వ ప్రక్రియలు కూడా కాంగ్రెస్ పాలనలో ప్రహసనంగా మారాయి. కారుణ్య నియామకాలు ఆయా శాఖల్లో సర్వసాధారణం. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యం, ప్రమాదం, ఇతర కారణాలతో మరణిస్తే ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవద్దనే ఉద్దేశంతో ఆ కుటుంబంలోని అర్హత గల వ్యక్తికి ఉద్యోగం కల్పిస్తారు. ఇది ఆయా శాఖల్లో నిత్యం సాధారణ ప్రక్రియ.
రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 582 మంది ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారు. ఆయా కుటుంబాల్లోని అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలా కారుణ్య నియామకాలకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది జనవరిలోనే జీవో జారీచేసింది. 582 ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్మెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు. అయినా, కారుణ్య నియామకాలు జరుగకపోవడంతో మళ్లీ ఈ నెల 6న మరోసారి ఆదేశాలు జారీచేశారు. రెండు నెలలు ఉద్యోగులను తిప్పించుకొని గురువారం రవీంద్రభారతిలో నియామక పత్రాలు అందించారు.
దుబారా ఖర్చు చేయం.. అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిచోటా చెప్తున్నారు. కానీ, నిరాడంబరంగా జరుగాల్సిన కారుణ్య నియామకాలను రాజకీయ లబ్ధికోసం, ప్రచారం కల్పించుకుంటున్నారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల క్రితమే ఇవ్వాల్సిన కారుణ్య నియామకపత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం కోసమే ఇన్నాళ్లు ఆపివేశారా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం రవీంద్రభారతిలో గురువారం అట్టహాసంగా కొలువుల పండుగ నిర్వహించింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిశాఖ, పురపాలకశాఖకు చెందిన 922 మంది ఉద్యోగులకు సీఎం నియామకపత్రాలు అందజేశారు. ఇందులో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో కారుణ్య నియామకాల కింద 582 మంది జూనియర్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు ఉన్నారు.