హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ) : గోదావరి బేసిన్‌లోని ఆయకట్టుకు సాగునీరందడం ఈ ఏడాది కష్టమే. గోదావరి బేసిన్లో ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలతో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరందే పరిస్థితి ఉన్నదని ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సమృద్ధిగా వర్షాలు పడకుంటే గోదావరి బేసిన్లో ఆయకట్టుకు సాగునీరందడం ఈ ఏడాది కష్టమేనని చెప్తున్నారు. 2025-26 సంవత్సరం వానకాలం సాగు కోసం భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) ఈఎన్సీ అమ్జద్హుస్సేన్, సీఈ రఘునాథరావు నేతృత్వంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సంబంధిత యాక్షన్ప్లాన్పై టెరిటోరియల్వారీగా ఆయా చీఫ్ ఇంజినీర్ల నుంచి ఈఎన్సీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై చర్చించారు. అయితే, కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుకు మాత్రం ఢోకా లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లో 18 లక్షల ఎకరాల పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ఎస్సీఐఈఏఎం నిర్ణయించినట్టు సమాచారం.
కృష్ణా బేసిన్‌తో పోల్చితే ఈసారి గోదావరి బేసిన్లో దయనీయ పరిస్థితి నెలకొన్నది. బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులకు ఆశించిన మేర జలాలు చేరలేదు. ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, తాలిపేరు, శబరి తదితర నదులు పొంగిపొర్లడంతో లోయర్ గోదావరి ఉధృతంగా ప్రవాహించింది. ప్రాణహిత నుంచే దాదాపు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం లక్ష్మీబరాజ్ వద్ద గోదావరిలో కలిసి దిగువకు తరలిపోయింది. ఎగువన ప్రధాన గోదావరిలో మాత్రం ఆ మేరకు వరద ప్రవాహాలు లేకుండా పోయాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, సగం కూడా నిండలేదు. నిజాంసాగర్, సింగూరులో అంతంతమాత్రమే. ఇక కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి కొద్దిమేరకు జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టులపై ఆధారపడిన ఆయకట్టుకు నీరందించడం ఎలా? అని సాగునీటి శాఖ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.
వానలు కురిస్తేనే గోదావరి బేసిన్‌లోని పూర్తి ఆయకట్టుకు సాగునీరందించే పరిస్థితి ఉంటుందని కమిటీ సమావేశంలో చీఫ్ ఇంజినీర్లు తెలిపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకుని మొత్తంగా గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద ప్రస్తుతానికి ఆరు లక్షల ఎకరాలకే నీరందించవచ్చని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2 కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందివ్వడం కష్టమేనని అధికారులు ఆ సమావేశంలో అభిప్రాయం వ్యక్తంచేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈఎన్సీ సంబంధిత ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. మరో 15 రోజులపాటు చూసి అప్పటికీ వర్షాలు రాకపోతే మరోసారి ప్రాజెక్టులవారీగా సమీక్షించి వానకాలం ఆయకట్టును ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తున్నది. మొత్తంగా ప్రస్తుతానికి మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న జలాలతో 39 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.