హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్నూరుకాపు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని, ఏటా రూ.5,000 కోట్లు కేటాయించాలని మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో హాస్టల్ భవనాలకు రెండు ఎకరాల చొప్పున భూమి, రూ.5 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు. తమ సమస్యలను బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచాలని విన్నవించారు.
బీసీ సంక్షేమశాఖ మంత్రి, మున్నూరుకాపు అపెక్స్ కమిటీ చైర్మన్ గంగుల కమలాకర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య తదితరులు గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో సమారు 50 లక్షల మంది మున్నూరుకాపులు ఉన్నారని, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారని ఈ సందర్భంగా కేటీఆర్‌కు వివరించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తమను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు.