TG Police | తెలంగాణలో మతపరంగా హైదరాబాద్ తరువాత అత్యంత సున్నితమైన ప్రదేశమది. రాఖీ పౌర్ణమినాడు ఓ ఆదివాసీ మహిళపై మరో వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ లైంగికదాడికి ప్రయత్నించి, ఆపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాడు స్పృహ కోల్పోయిన బాధిత మహిళ మూడు రోజుల క్రితమే స్పృహలోకి వచ్చి తనకు జరిగిన ఘటనను వివరించింది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయినా స్థానిక పోలీసులు నిర్లిప్తంగానే ఉన్నారు.
తమ జాతి మహిళపై జరిగిన ఘటనకు వ్యతిరేకంగా ఆదివాసీలు పెద్ద ఎత్తున నిర్వహించిన ఆందోళనను ‘నమస్తే తెలంగాణ’ ప్రముఖంగా ప్రచురిస్తూ.. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు హెచ్చరించింది. అయినప్పటికీ పోలీసులు ఎటువంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేదు. దీంతో ఒక్కసారిగా చిచ్చురేగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో బుధవారం పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. ఐదు గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి.
మండల కేంద్రంలో 50కిపైగా దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఓ స్కార్పియో సహా అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ఆయుధాలు, కట్టెలు, రాళ్లు తీసుకొని రోడ్లపైకి వచ్చారు. పరస్పరం రాళ్ల దాడులు, ఇండ్లు, షాపుల దగ్ధంతో జైనూర్ మండల కేంద్రం రణరంగాన్ని తలపించింది. ఇటీవలి కాలంలో మతకల్లోలాలకు దారితీసే ఘటనలు వరుసగా నాలుగు జరిగాయి. అయినప్పటికీ హింసను అరికట్టడంలో నిఘావర్గాల వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గడచిన నెలరోజులుగా చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు పట్టుతప్పుతున్న శాంతిభద్రతలకు దర్పణం పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా, పోలీసు ఉన్నతాధికారుల వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నాయి. గత పదేండ్లలో ఎన్నడూలేనివిధంగా వర్గవైషమ్యాలు చెలరేగిపోవటం ఆందోళన కలిగిస్తున్నది.
తాజాగా జైనూర్‌లో చోటుచేసుకున్న సంఘటన రాష్ట్రంలో నెలకొంటున్న అశాంతివాతావరణానికి అద్దం పడుతున్నది. పోలీసులు, నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఓ ఆదివాసీ మహిళపై వేరొక వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ లైంగికదాడి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదొక్కటే కాదు గత నెల మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంతోష్నగర్లోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అది మరువక ముందే ఓల్డ్ సిటీలో, ఆపై గోషామహల్ పరిధిలో రెండు వర్గాల ప్రజలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. జైనూర్ తరహాలనే ఈ ఘటనలేవీ బయటకు రాకుండా పోలీసులు తొక్కిపెడుతున్నారు. తమ వైఫల్యలాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం వెలుగుచూస్తున్న వరుస సంఘటనలు రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయిందనే సంకేతాన్ని ఇస్తున్నది. ఇది ప్రధానంగా హోంశాఖను తన వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలన వైఫల్యమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. హోంశాఖపై సీఎం ఎన్నడూ పూర్తిస్థాయిలో సమీక్ష చేయలేదు. డీజీపీ సైతం శాంతిభద్రతల పరిస్థితులు, తాజాగా వెలుగుచూస్తున్న ఘటనలపై ఆరా తీసిన ఆనవాళ్లు కనిపించలేదు. నిఘా వ్యవస్థపై సమీక్ష అంతంతమాత్రమేనని సమాచారం. దీంతో దిగువస్థాయి పోలీసు ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలను గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. సీనియర్ పోలీస్ ఆఫీసర్ల లోటు శాంతిభద్రతలు దిగజారిపోవడానికి కారణమని పోలీసు వర్గాలే బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. సర్కారు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంటుందని తెలంగాణ మేధావులు హెచ్చరిస్తున్నారు.