హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలంగాణలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహానికి సామాన్యులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం కొద్దిమొత్తంలో నగదు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్న పోలీసులు ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని చెబుతున్నారు. వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం దాచుకున్న డబ్బుకు ఆధారాలు ఎక్కడి నుంచి తేవాలో తెలియక వారు నానా అగచాట్లు పడుతున్నారు. అంతేకాదు, ఆధారాలు చూపినా సరే నిబంధనల పేరుతో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరుతో పండుగ వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయంటూ వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
శంకర్‌పల్లిలో ఇటీవల ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం డబ్బు తీసుకుని వెళ్తున్న విషయాన్ని గుర్తించిన ఓ కానిస్టేబుల్ ఆయనను వెంబడించి తనిఖీల పేరుతో రూ. 80 లక్షలు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేసినట్టు ప్రచారం జరిగింది. కొందరు పోలీసులు బ్యాంకుల వద్ద మఫ్టీలో నిఘా వేసి పెద్దమొత్తంలో డబ్బు డ్రా చేసి తీసుకెళ్తున్న వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తనిఖీల సమయంలో పోలీసులతోపాటు ఐటీ అధికారులు కూడా ఉంటే ఆధారాలు చూపించిన వెంటనే వారిని వదిలిపెట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
వ్యాపారుల వద్ద వసూలు చేసిన సొమ్మును బ్యాంక్‌లో జమచేసేందుకు తీసుకెళ్లే ఎగ్జిక్యూటివ్‌లను కూడా పోలీసులు వదలడం లేదు. ఆధారాలు చూపించినా సరే విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్నారు. తాము పట్టుకున్నాం కాబట్టి ఆ ఆధారాలను ఎన్నికల అధికారులకు చూ పించి తీసుకోవాలంటూ రిసిప్ట్ ఇచ్చి పంపిస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు నాలుగైదు రోజులపాటు తిరి గి ఆ సొమ్మును వెనక్కి తెచ్చుకోవాల్సి వస్తోంది. అధికారికంగా జరిగే బంగారు లావాదేవీలనూ పోలీసులు విడిచిపెట్టడం లేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. ఆధారాలు చూపిస్తున్నా సీజ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దవాఖానల్లో బిల్లు కట్టేందుకు సొమ్ము తీసుకెళ్లేవారు, భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు తీసుకెళ్లేవారిని కూడా పోలీసులు వదిలిపెట్టడం లేదు. దసరా షాపింగ్‌కు చేతిలో నగదు పట్టుకుని వెళ్లేందుకు కూడా జనం భయపడుతుండడంతో పండుగ వేళ మాల్స్, షాపిం గ్ మాల్స్ బోసిపోతున్నాయి.
తనిఖీలతో విసిగిపోతున్న ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులను ఇబ్బంది పెట్టడం మాని, ఎన్నికల ఖర్చు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే డబ్బుపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక నుంచి వందలకోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో తెలంగాణకు వస్తున్నాయని, ఎన్నికల సంఘం దానిపై దృష్టిపెడితే మంచిదని చెప్తున్నారు. గుజరాత్ నుంచి హవాలా మార్గంలో వస్తున్న సొమ్ముతోపాటు ఒడిశా, ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.