మహబూబ్‌నగర్, జనవరి 8 : ఎనిమిది నెలలైనా బెనిఫిట్స్ రావడం లేదని.. ఈ పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని రిటైర్డ్ ఏఆర్ ఎస్సై సాధిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బుధవారం వైరల్ అయ్యింది. ‘నేను రిటైర్ అయి 8 నెలలైంది. ప్రభుత్వం నుంచి ఇంకా డబ్బులు రాలేదు. నేను ప్రైవేట్ ఫైనాన్స్‌లో హౌసింగ్ లోన్ తీసుకున్నాను. విధి నిర్వహణలో ఉండగా.. తోటి ఉద్యోగుల వద్ద కొంత అప్పు చేసిన. ఉద్యోగ విరమణ వచ్చే బెనిఫిట్స్ డబ్బులు వారికి చెల్లిద్దామనుకున్నా. కానీ నేటికీ పైసలు రాలేదు. వారికి వడ్డీ కూడా కట్టలేకపోతున్నా. వచ్చే పెన్షన్ కుటుంబ పోషణకే సరిపోతున్నది.
బెనిఫిట్స్ కోసం ఎదురుచూసి ఆశ వదులుకొని చనిపోవాలనుకుంటున్నా. నేను చస్తే కాని ప్రభుత్వం డబ్బులు ఇచ్చేలా లేదు. రైతు మరణిస్తే అప్పటికప్పుడు రూ.5 లక్షలు ఇస్తున్నా రు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చే యండి.. సీఎం రేవంత్‌కు చేరే వర కు వైరల్ చేయం డి. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు.. కానీ గవర్నమెంట్ సర్వెంట్ల గురించి.. రిటైర్ అయిన వారి తరపున ఎవరూ మాట్లాడం లేదు. డబ్బుల కోసం అప్పుల వారు ఇంటి కి వస్తున్నారని నేను ఊర్లు తిరుగుతూ దాక్కుంటున్నా. ఇలాంటి దుస్థితి వచ్చింది నాకు. ఏం చేయాలో తోచక వీడియో తీసిన. నేను చనిపోతే నా కొడుక్కు పైసలు ఇస్తేనేమో తీసుకోండి. లేకపోతే నన్ను క్ష మించండి.. చేతులు జోడించి వేడుకుంటు న్నా’.. అని మనస్తాపంతో వీడియో తీశాడు.
బెనిఫిట్స్ ఇప్పిస్తానని ఎస్పీ హామీ
ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంటానని సాధిక్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఎస్పీ జానకి బుధవారం అతడిని పిలిపించి మాట్లాడారు. అతడి సమస్యను తెలుసుకొని రావాల్సిన బెనిఫిట్స్‌ను అందజేస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.