Inquiry Commission | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): దీపావళికి ముందే బాంబులు పేలుతాయంటూ ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మా రాయి. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్లు సైతం రాజకీయ దురుద్దేశాలతోనేనని తేలిపోతున్నది. వేగవంతంగా విచారణ కొనసాగిస్తామని ప్రగల్బాలు పలికి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం నెలల పాటు సాగదీస్తున్నదని రాజకీయ విశ్లేషకులు నొక్కిచెబుతున్నారు. విచారణ దశలోనే ఆయా అంశాలపై రాజకీయ విషప్రచారానికి పూనుకోవడం ఇందులో భాగమేనని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం సాగదీస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు కాళేశ్వరం, విద్యుత్ కమిషన్ల విచారణ తీరునే ఉదాహరిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 100 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ విచారణ కొలిక్కిరాలేదు.
ఇదిలా ఉంటే కమిషన్ విచారణ గడువును ఇప్పటికే పలుసార్లు పొడగించారు. ఆ గడువు సైతం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి పొడగించక తప్పని పరిస్థితి. గడువు పెంపునకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు అధికారవర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సైతం ఇదే రీతిగా కొనసాగుతున్నది. అదీగాక ఆ కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ నర్సింహరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కోర్టులో పిటిషన్ దాఖలు కావడం, దీంతో ఆయనను సుప్రీంకోర్టు తప్పించి మరొకరిని విచారణ కోసం నియమించడం తెలిసిందే. ఈ ఉదంతం కూడా రాజకీయ దురుద్దేశాలతోనే కమిషన్ల ఏర్పాటు జరిగిందని గతంలోనే చర్చ జరిగింది. అయితే తాజాగా మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో అది మరింత బలోపేతమవుతున్నది. కమిషన్ల పేరిట బీఆర్ఎస్ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్రకు ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.