పాత కమీషన్‌నూ ఇవ్వని సర్కార్‌హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పేదలకు రేషన్ బియ్యం పంపి ణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్‌డీలర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పస్తులుండే పరిస్థితి నెలకొన్నది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పౌరసరఫరాల సంస్థ సుమారు మూడు నెలలుగా కమీషన్ విడుదల చేయడం లేదని తెలిసింది. కమీషన్ ఆదాయంపైనే ఆధారపడిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల మెదక్ జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
70 కోట్ల బకాయిలు
రేషన్ బియ్యం పంపిణీ చేసినందుకు డీలర్లకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తున్నది. రాష్ట్రంలో సుమారు 17,200 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వీరంతా ప్రతి నెలా 1.6 లక్షల టన్నుల బియ్యం పేదలకు పంపిణీ చేస్తారు. ఇందుకుగాను వీరికి ప్రతి నెలా కమీషన్ రూ పంలో సుమారు రూ.23 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మూడు నెలలుగా కమీషన్ చెల్లింపుల్లో పౌరసరఫరాల సంస్థ జాప్యం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్ బకాయిలు రూ.70 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు స మాచారం. ఈనెల కూడా పూర్తయితే నాలుగు నెలల బకాయిలు రూ.100 కోట్లకు చేరుతాయని చెప్తున్నారు. కమీషన్ విడుదలలో జాప్యానికి పౌరసరఫరాల సంస్థలోని పలువురు అధికారుల తీరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ హామీలు గాలికి..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లపై కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల క్రితం కమీషన్‌ను 100% పెంచింది. గతంలో కమీషన్ క్వింటాల్‌కు రూ.70 ఉండగా దానిని రూ.140కి పెంచింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రేషన్ డీలర్ల కమీషన్‌ను రూ.300కు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతోపాటు ప్రతి నెలా రూ.5వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఆశ పెట్టింది. తీరా అధికారంలోకి కమీషన్ విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.