Pharma City | యాచారం, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘గతంలో ఫార్మాసిటీ బాధిత రైతులు కన్నీరు పెట్టారు. ఆ భూతంలాంటి పరిశ్రమను మీలో చాలామంది వ్యతిరేకించారు. మీరే గత ప్రభుత్వాన్ని దించిండ్రు. అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరిచ్చిన శక్తితోనే యాచారం మండలం నుంచి ఫార్మాసిటీ పారిపోయింది. ఇంకా ఫార్మాసిటీ ఉన్నదన్న భ్రమలో చాలా మంది ఉన్నరు. ఇక ఫార్మాసిటీ భూతమే ఉండదు. ఉంటే గింటే కాలుష్యంలేని ఇండస్ట్రీలు ఉంటయి. ఒకవేళ ఫార్మా ఉంటే మల్రెడ్డి రంగారెడ్డి గతంలో కంటే మీకు ఎక్కువగా అండగా ఉంటడు..’ ఇదీ ఫార్మా సిటీపై సాక్షాత్తూ అధికార కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు. యాచారం మండల కేంద్రంలో మంగళవారం జరిగిన భూభారతి అవగాహన సదస్సు వేదికగా అధికారికంగా ఆయన ఈ మేరకు కుండబద్దలు కొట్టారు. అయితే, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఫార్మా సిటీ రద్దుపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని లిఖితపూర్వకంగా సమాధానం చెప్పింది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం అసలు ఫార్మా సిటీ ఇంకా ఉందనుకోవడం భ్రమ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా రైతులతోనే కాదు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంతోనూ ప్రభుత్వం దోబూచులాడుతున్నదని దీన్నిబట్టి స్పష్టమవుతున్నది.
రైతు భరోసా రావట్లే…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల కేంద్రంలో ఉన్న సాయి శరణం ఫంక్షన్ హాల్లో మంగళవారం ఆర్డీవో అనంతరెడ్డి అధ్యక్షతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫార్మా రైతులు ఆందోళనలు చేస్తారేమోనని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ముందుగానే రైతులతో మాట్లాడారు. సమావేశంలో ఎలాంటి ఆందోళన చేయొద్దని, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు నేరుగా ఆయనతో మాట్లాడిస్తానని హామీ ఇచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు.
సమావేశానికి ముఖ్య అథితిగా వచ్చిన ఎమ్మెల్యేను రైతులు ఫంక్షన్ హాల్ బయటే చుట్టుముట్టారు. రెవెన్యూ రికార్డుల్లో తమ భూములు టీజీఐఐసీ పేరిట ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీని రద్దు చేసి, తమ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. 2,250 ఎకరాలను ఆన్లైన్లో రైతుల పేర్ల మీదికి ఎక్కించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పేర్లు ఆన్లైన్లో లేనప్పటికీ రైతుబంధు, రైతు బీమా, పంట నమోదు పక్రియ కొనసాగిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు రైతు భరోసా అందడం లేదని వాపోయారు. తాము భూములను సాగు చేసుకుంటున్నా రికార్డుల్లో మాత్రం ఎలాంటి పంటలు వేయనట్టుగా చూపిస్తున్నారని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకుడు కానమోని గణేశ్ వివరించారు. రైతులు చెప్పినదంతా విన్న ఎమ్మెల్యే… ఈ సమస్యపై సమావేశంలో మాట్లాడుకుందామని రైతుల్ని లోపలికి తీసుకువెళ్లారు.
రైతు సమస్యలపై మౌనం
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. అసలు ఫార్మా సిటీ లేదని పేర్కొన్నారు. ఫార్మా సిటీ ఉన్నదనే భ్రమ నుంచి రైతులు బయటకురావాలని సూచించారు. అయితే, రైతుల సమస్యలపై మాత్రం పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఆన్లైన్లో తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, అదీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే చేపట్టాలని రైతులు కోరగా.. అసలు ఆ అంశాన్నే ఎమ్మెల్యే ప్రస్తావించలేదు. ‘ధరణి, గత ప్రభుత్వం’ అంటూ సుదీర్ఘ ప్రసంగం చేసి, అసలు విషయాలను ప్రస్తావించకుండానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో రైతులు తమ సమస్య పరిష్కారం మాటేమిటని అడుగుతుండగా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.