వరదలు వచ్చినపుడు ఎగువ రాష్ర్టాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు? వరదను భరించాలేగానీ దాని నుంచి ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుంది? బనకచర్ల ప్రాజెక్టుతో వృథా జలాలనే మళ్లిస్తాం’
ఆవిష్కరించిన తాజా సూత్రమిది మరి.. సముద్రం ఉండటం వల్ల వరదలు మాత్రమే రావడం లేదు కదా. 974 కిలోమీటర్ల సముద్ర తీరంతో అక్వా ఉత్పత్తులతోపాటు ప్రపంచంలోనే అత్యంత లాభసాటి అయిన జల రవాణా (పోర్టులు)తో వచ్చే ప్రయోజనాలు కూడా ఆంధ్రప్రదేశ్ పొందుతున్నది కదా. మరి ఏపీ సీఎం ఈ ప్రయోజనాలను ఎగువ రాష్ర్టాలకు పంచుతున్నారా?. ఎగువ రాష్ర్టాలకు సముద్ర తీరంలేని లోటును ఏమైనా పూడ్చుతున్నారా?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): భౌగోళికంగా రాష్ర్టాలకుగానీ.. ప్రాంతాలకుగానీ.. దేశాలకుగానీ.. కొన్నిరకాల ప్రయోజనాలుంటాయి. అదే రీతిన కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అంతమాత్రాన వాటి ప్రామాణికంగా నదీజలాల్లో మినహాయింపులు, ప్రత్యేక కేటాయింపులు ఏమీ ఉండవనేది సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదాలో పని చేసిన, చేస్తున్న చంద్రబాబుకు తెలియనిది కాదు. కాకపోతే సందర్భానుసారంగా వింత, విచిత్రమైన వాదనలు ఆయన నోటి నుంచి జాలువారుతుంటాయనేది రెండు రాష్ర్టాల్లోని ప్రజలకు అనుభవంలోనిదే. ఆ మాటకొస్తే… కృష్ణశాస్త్రి బాధ, లోకం బాధ అయినట్టు! అధికారంలో ఉన్నపుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మీద వరుసగా ఫిర్యాదులు చేసిన ఇదే చంద్రబాబు… అవసరం వచ్చినపుడు ‘నేనెప్పుడైనా కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించానా?’ అని కూడా సెలవిస్తారు.
ఒకడుగు ముందుకేసి… బనకచర్లకు అడ్డుపడుతున్నారంటూ తన బాధను ఇలా వింత సూత్రీకరణలతో లోకం బాధగా చూపుతారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కొబ్బరికాయను సమానంగా పగలగొట్టాలని చెప్పినా… నిన్నటికినిన్న సముద్రంలో కలిసే వృథాజలాలు అంటూ అంతర్జాతీయ నీటి ప్రమాణాల్లో లేని పదాలను తెచ్చి పెట్టినా… ఇప్పుడు వరదలను భరిస్తున్నందున బనకచర్ల ప్రాజెక్టుకు అంగీకరించాల్సిందేనని సూత్రీకరించినా అది చంద్రబాబుకే చెల్లింది. ఆ మాటకొస్తే… చంద్రబాబు సూత్రీకరణతో అసలు ప్రపంచంలో వరద ప్రభావాలు, నష్టాలను చవి చూడని ప్రాంతాలేమైనా ఉన్నాయా? అని ప్రస్తుతం నిపుణులు సైతం తలబద్దలు కొట్టుకొంటున్నారు. అంతేకాదు… భౌగోళిక స్వరూపమే ఇలా ఒక అస్త్రంగా వాడుకోవాలనుకుంటే గట్టున ఉన్న తెలంగాణకు నదీజలాల్లో ఒక పెచ్చు కేటాయింపులను ఎక్కువగా ఇవ్వాలనేది అంతర్జాతీయంగా అంగీకరించే మానవతా సూత్రమనే సత్యాన్ని చంద్రబాబు గుర్తించాలని కూడా సూచిస్తున్నారు.
చలికాచుకుంటున్న కేంద్రం
వాస్తవానికి అసలు గోదావరిలో మిగులు జలాలు అనేవి ఉన్నాయా? అనేది తేల్చాల్సిన కేంద్రంలోని మోదీ సర్కారు తెలుగు రాష్ర్టాల మధ్య బనకచర్ల కుంపటిని తమాషాగా చూస్తున్నది. మిగులు జలాలు దేవుడెరుగు… తెలంగాణకు హక్కు భుక్తంగా వచ్చిన 968 టీఎంసీల గోదావరిజలాల్లో ఇంకా వాడుకోని జలాలు అందులో ఎన్ని ఉన్నా యో ముందు తేల్చండి అని బీఆర్ఎస్తోపాటు సాగునీటి రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రాణహిత, ఇంద్రావతి మీద సాగునీటి ప్రాజెక్టులు కట్టకపోవడం ఒకవంతైతే… ఇతర సబ్బేసిన్లలో కట్టిన ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వను నామమాత్రంగా డిజైన్ చేయడంతో పొరుగు రాష్ర్టాలు కొత్త ప్రాజెక్టుల పేరెత్తితేనే గుబులుపడాల్సిన దుస్థితి ఏర్పడింది. గోదావరి జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించినవి 1,484 టీఎంసీలైతే అందులో తెలంగాణ వాటా 968 టీఎంసీలు. కానీ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి పాలకులు సాగునీటి కోసం ఏర్పాటు చేసిన నీటి నిల్వ సామర్థ్యం కేవలం 114 టీఎంసీలు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 90 టీఎంసీలు, లోయర్ మానేరు డ్యాం 24 టీఎంసీలు. 29.92 టీఎంసీలతో సింగూరు నిర్మించినా హైదరాబాద్ తాగునీటి కోణంలోనే తప్ప రైతులకు సాగునీరు అందించేందుకు కాదు. పైగా ఎస్సారెస్పీ, ఇతర ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయి ఈ నిల్వ కూడా ఇంకా పడిపోయింది. ఇక గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ఉమ్మడి పాలకులు చిధ్రం చేశారు.
కాళేశ్వరమే ప్రాణాధారం
ఆరు దశాబ్దాల పాలకుల పుణ్యమా అని తెలంగాణ దశాబ్దాల పాటు తీవ్ర కరువును ఎదుర్కొన్నది. రైతులు నిత్యం మొగులు దిక్కు చూడాల్సి వచ్చింది. అందుకే కేసీఆర్ రెండు, మూడు ఏండ్లు కరువు వచ్చినా సాగునీటి గోస రావద్దనే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తాపత్రయపడ్డారు. అందులో భాగంగానే ప్రాణహిత-చేవెళ్లలో పట్టుమని పది టీఎంసీల వరకు ఉన్న నీటి నిల్వ సామర్థ్యాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏకంగా 141 టీఎంసీలకు పెంచారు. అంటే ఆరు దశాబ్దాల్లో సాధించని నీటి నిల్వను ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే తెలంగాణకు ప్రాణధారంగా మార్చారు. ఇంకా సీతమ్మసాగర్, వార్ధా, కుప్తి తదితర అనేక జలాశయాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అవికూడా పూర్తయితే మరో 100 టీఎంసీల మేరకు నిల్వసామర్థ్యం పెరుగుతుంది. అదీగాక అవకాశమున్న చోట చెరువుల సామర్థ్యాన్ని కూడా భారీగా విస్తరిస్తుండటమే గాక, సాగునీటి ప్రాజెక్టులతో వాటిని అనుసంధానం చేస్తున్నారు.
వాగులన్నింటిపైనా చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్లోనే 500 టీఎంసీలకు పైగా నిల్వచేసుకునే స్థాయికి తెలంగాణ ఎదిగింది. అక్కడితో ఆగకుండా ఉమ్మడి రాష్ట్రం అత్తెసరు నీటినిల్వ సామర్థ్యంతో, మొత్తంగా నీటి నిల్వ వెసులుబాటు లేకుండానే నిర్మించిన, ప్రతిపాదించిన ప్రాజెక్టులపైనా భారీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలను ప్రతిపాదించారు. ఇది రాష్ట్రంలో తలసరి నీటి లభ్యతను, తలసరి నీటి నిల్వ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నాయి. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్, ఎగువ, మధ్య, దిగువ మానేరు, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులను అనుసంధానించి వాటి ఆయకట్టుకు భరోసా కల్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రగతి కాళేశ్వరానికి ముందు, ఆ తరువాత అనే నిర్వచించవచ్చు. అందుకు నేడు గత ప్రాజెక్టుల కింద సాగవుతున్న ఆయకట్టు, వస్తున్న పంటల ఉత్పత్తినే అందుకు ఒక సజీవ సాక్ష్యం.
చేతులెత్తేసిన రేవంత్
మన బంగారం మంచిదైతే… ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరముండదనేది పెద్దలు చెప్పే నీతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సృష్టించిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ తెలంగాణ సమాజం పరిస్థితి ఇట్లనే తయారైంది. హైదరాబాద్‌లో ఉన్నంత సేపు బనకచర్లను అడ్డుకుంటా! అంటూ అడ్డంపొడగు ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి… విమానం ఎక్కి ఢిల్లీ పోగానే మాటమార్చి కమిటీని ప్రతిపాదించిన సంతకం పెట్టి వచ్చారు. దీంతో దీన్ని ఆసరాగా చేసుకొని పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు రోజుకో నీతి సూత్రంతో బనకచర్లను కట్టి తీరుతామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల కిందట పంద్రాగస్టు వేడుకల్లో ఇదేరీతిన వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసే వృథాజలాలే కదా… అని ఒకసారి! ఎగువన మీరు కూడా ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అంటూ మరోసారి!! అసలు కాళేశ్వరం తాను వ్యతిరేకించనేలేదని ఇంకోసారి!!! దిగువన వరదలను భరిస్తున్నందున బోనస్‌గా బనకచర్లను ఒప్పుకోవాలంటూ తాజాగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
తెలంగాణ భౌగోళికంగా గట్టున ఉన్నది. ఇటు కృష్ణా… అటు గోదావరి… ఏ నదీ బేసిన్లోనైనా సాగునీటిని తరలించుకోవాలంటే వందల మీటర్ల ఎత్తిపోతల పథకాలను చేపట్టాల్సి వస్తుంది. ఈ సాకుతోనే కదా ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వకుండా గోసపెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్‌కు భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) మీదనే సాగునీరు అందుతుంది. అందుకే అక్కడ ప్రాజెక్టులకయ్యే ఖర్చు కంటే తెలంగాణ మూడు, నాలిగింతల ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బాబుగారి ఈ వింత, అంతర్జాతీయ జల సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే… తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకయ్యే ఖర్చును ఇతర రాష్ర్టాలు ఏమైనా పంచుకుంటున్నాయా? కనీసం ఇన్నాళ్లూ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మాట సాయమైనా చేస్తున్నదా?బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎగువన ఉన్న రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వరదలతో భారీగా నష్టం వాటిల్లుతుంది. మరి సముద్రంతో ప్రయోజనాలు పొందుతున్న ఏపీ వంటి రాష్ర్టాలు.. ఎగువన ఉన్న రాష్ర్టాల్లో జరిగే నష్టాన్ని భరిస్తాయా?
– ఇవీ చంద్రబాబుకు విశ్లేషకులు, నిపుణుల ప్రశ్నలు
నీటి నిల్వ సామర్థ్యం పెంపు ఇలా..గోదావరిలో