కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 14: తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ముగిసినట్టు తెలిసింది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగ్ నేతృత్వంలో సీఆర్పీఎఫ్ సారథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
తెలంగాణలోని ములుగు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో ఎత్తయిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 21 రోజులపాటు ‘ఆపరేషన్ కగార్’ నిర్వహించినట్టు ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పు ల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు పేర్కొన్నారు. 28 మృతదేహాలను గుర్తించామని, వీరి పేరిట రూ.1.72 కోట్ల రివార్డు ఉన్నదని తెలిపారు.