హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతపై క్యాడెట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్యాడెట్లకు ట్రెడిషన్, ఇన్నోవేషన్ అవసరమని, రెండింటి సమ్మేళనంతో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పరేడ్‌లో 213 మంది యువ పైలట్లు సైనిక విన్యాసాలు చేశారు. వీరితోపాటు ఇతర దేశాల సైనికాధికారులు కూడా విన్యాసాల్లో పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాప్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు రాజ్‌నాథ్‌సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్నో ఇన్నోవేషన్లు వస్తున్నాయని, వాటి పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, పండుగలకు అన్నింటికీ దూరంగా ఉండి శిక్షణను పూర్తి చేసుకున్నారని, అదే శ్రద్ధతో భవిష్యత్తులోనూ పనిచేయాలని సూచించారు. క్యాడెట్లపై మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పర్యవేక్షించారు.