హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై సర్కారుతో తాడేపేడో తేల్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు రెడీ అ య్యాయి. పోరాటాన్ని మరింత ఉధృతం చే యాలని నిర్ణయించాయి. సోమవారం నుంచి కాలేజీల నిరవధిక మూసివేత విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించాయి. సర్కారు దిగిరాకపోతే ఈనెల 23 లేదా 24న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామని హెచ్చరించాయి. లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో మార్చ్‌తో కదం తొక్కుతామని ప్రకటించాయి. ఫెడరేషన్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సర్కారు నుంచి ఎలాం టి స్పష్టతలేకపోవడంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యిం ది. మాసాబ్‌ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రెస్‌మీట్ నిర్వహించింది.
కాలేజీల ప్రతినిధులు సర్కారు వైఖరిని తీవ్రంగా నిరసించారు. బకాయిలను విడుదల చేయాలని పదే పదే కోరినా.. ప్రభుత్వం తమతో సమావేశమయ్యేందుకు మాత్రమే ఆహ్వానించిందని, సంక్షోభానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఫతి ప్రతినిధులు ప్రకటించారు. బకాయిలు విడుదల చేసే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని వెల్లడించారు. తాము కార్యాచరణ ప్రకటించినా సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై స్పష్టత ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు ఫైర్ అయ్యాయి. డిమాండ్లు నెరవేర్చే వరకు కార్యాచరణపై వెనక్కి తగ్గొద్దని నిర్ణయించాయి. సోమవారం నుంచి అన్ని కాలేజీలకు తాళాలేస్తామని, విద్యార్థులెవరు రావొద్దని కోరాయి. ఇంజినీరింగ్ ఇంటర్నల్, బీఈడీ, బీ ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలకు సహకరించబోమన్నాయి. 15న ఇంజినీర్స్డేను బ్లాక్‌డేగా పాటించనున్నట్టు వెల్లడించాయి. ఫతి సెక్రటరీ జనరల్ కేవీ రవికుమార్, కోశాధికారి కృష్ణారావు, సునీల్‌కుమార్, రాందాస్ తదితరులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు.
ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్‌కు ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. ఫీజు బకాయిల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు.
గత ప్రభుత్వ బకాయిలతో తమకేం సంబంధమంటూ కొందరు మంత్రులు మాట్లాడారు. ఇది అత్యంత దారుణం. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం మరింత బాధించాయి. కాంట్రాక్టర్లు, సంక్షేమ పథకాల కోసం చాలా మంది ప్రభుత్వాన్ని బెదిరించి డబ్బులు తీసుకెళ్లారు. ఒక్క కాలేజీ యాజమాన్యాలు మాత్రమే మౌనం వహించాయి. ప్రభుత్వం డబ్బులివ్వాల్సిన అవసరం లేకుండా ట్రస్ట్బ్యాంక్ను ఏర్పాటు చేయాలని కోరాం. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. ఏడాది క్రితం ట్రెజరీల ద్వారా టోకెన్లు విడుదలయ్యాయి. కానీ డబ్బులు విడుదల చేయకపోవడం ప్రభుత్వానికే అవమానకరం. టోకెన్లు జారీఅయిన వాటికి రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అంతవరకు మా పోరాటం కొనసాగుతుంది.