మాదాపూర్, అక్టోబర్ 22: నారాయణ కళాశాలలో దారుణం చోటుచేసుకున్నది. కళాశాల ఏవో, మహిళా లెక్చరర్‌పై దాడి చేసి దూషించాడు. కాగా యాజమాన్యం ఏవోతోపాటు బాధితురాలిని కూడా విధుల నుంచి తొలగించింది. దీంతో బాధితురాలు గేటు వద్ద ఆందోళనకు దిగిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మాదాపూర్‌లోని నారాయణ కళాశాలలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి కొంతకాలంగా అదే క్యాంపస్‌లో పనిచేస్తున్న మహిళా వార్డెన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడు.
విషయం ఓ అధ్యాపకురాలికి తెలియడంతో ఎవరికైనా చెబుతుందేమోననే అనుమానంతో ఏవోతోపాటు మహిళా వార్డెన్ సదరు అధ్యాపకురాలితో వాగ్వాదానికి దిగారు. అధ్యాపకురాలిని దూషించడంతోపాటు ఆమెపై దాడి చేశారు. ఈ పంచాయితీ కళాశాల ఏజీఎం వరకు వెళ్లింది. దీంతో ఏజీఎం ముగ్గురిని విధుల నుంచి తొలగించారు. బాధితురాలినైనా తనను కూడా విధుల నుంచి తొలగించడంతో నిరసనగా అధ్యాపకురాలు కళాశాల గేటు వద్ద బైఠాయించింది. సమాచారం తెలుసుకున్న నవ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు అధ్యాపకురాలికి మద్దతుగా నిలిచి ఆందోళన చేపట్టారు.