హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన అధికారిక సమీక్షలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు తీవ్రమైన అవమానం జరిగింది. కనీస ప్రొటోకాల్ పాటించకుండా వారిని కించపరిచారనే విమర్శలొస్తున్నాయి. జిల్లా మెజిస్ట్రేట్ స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు కింది స్థాయి అధికారుల స్థానాల్లో సీట్లను కేటాయించడం వివాదాస్పదమవుతున్నది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంగళవారం మం త్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గణేశ్ ఉత్సవాల సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇందులో డీజీపీ, మేయర్, పోలీసు కమిషనర్లతోపాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేశ్‌భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్‌తోపాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు మాత్రమే సమీక్ష కోసం ఏర్పాటుచేసిన వేదికపై కూర్చున్నారు. మిగిలిన శాఖల ఉన్నతాధికారులతోపాటు ముగ్గు రు కలెక్టర్లకు కూడా వేదిక కిందనే సీట్లు కేటాయించారు. అభిప్రాయాలను కూడా వేదిక కిందనే ఉంచి తీసుకున్నారు. కొంతమంది అధికారులను వేదికపైకి పిలిచి మరీ శాఖాపరమైన విధివిధానాలను వివరించాలని కోరిన మంత్రి.. కలెక్టర్లను మాత్రం వేదికపైకి ఆహ్వానించలేదు. కలెక్టర్లను వేదికపైకి పిలవకపోవడం సరైన విధానం కాదని, ప్రొటోకాల్‌కు విరుద్ధమని పలువురు చర్చించుకున్నారు.