హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల పరిధిలో భూకబ్జాలపై ఆ జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని 867 సహా ఇతర కొన్ని సర్వేనంబర్లలో ప్రభుత్వ స్థలాలు కబ్జాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కీసర ఆర్డీవో, ఘట్కేసర్ తహసీల్దార్‌ను ఆదేశించారు. సర్వేనంబరు 867లో 20.32 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ఏకంగా ఓ మాజీ ఎమ్మెల్యే 1,930 చదరపు గజాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మరో అర ఎకరానికి పైగా భూమిపై కబ్జాలో ఉన్నాడు.
ఈ వ్యవహారంపై మంగళవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘బావ కండ్లలో అనందం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ‘ముఖ్యనేత’ సతీమణికి బావనని చెప్పుకొంటూ సదరు మాజీ ఎమ్మెల్యే చేస్తున్న భూదందాపై సమగ్ర వివరాలు అందించింది. ఆ కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు కొర్రెముల ప్రభుత్వ భూముల వ్యవహరం పై పూర్తిస్థాయి నివేదకను ఒకటి, రెండు రోజుల్లో ఘట్కేసర్ తాహసీల్దార్ చంద్రశేఖర్ నివేదిక అందించనున్నారు. నమస్తే కథనం జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ నిషేధిత భూముల జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నారపల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడినట్టు తెలిసింది. ఘట్కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 867 సహా ఇతర సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్టు కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టర్ ప్రాథమిక విచారణలో భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. దీనిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి కలెక్టర్ లేఖ రాయగా, ఆ శాఖ విచారణ జరిపి సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో నూతన సబ్ రిజిస్ట్రార్‌ను నియమించే అవకాశాలున్నాయని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.