హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్ : గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఏజెంట్ చేసిన మోసంతో మస్కట్‌లో ఓ మహిళ అనేక కష్టాలు పడింది. 25రోజులుగా నరకయాతన పడుతున్న ఆమె.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మంగళవారం క్షేమంగా స్వదేశానికి చేరుకున్నది. వరంగల్‌కు చెందిన 45 ఏండ్ల మహమ్మద్ మహముదా నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి జూలై 16న టూరిస్ట్ వీసాపై మస్కట్‌కు వెళ్లారు. ఇంట్లో పని పేరుతో మస్కట్ తీసుకుపోయిన సబ్ ఏజెంట్ ఒక గదిలో ఆమెను బంధించడంతోపాటు సెల్‌ఫోన్, పాస్‌పోర్టు లాకొని వేధించారు. స్వదేశానికి వెళ్లాలంటే రూ.1.13 లక్షలు చెల్లించాలని లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని బాధితులు వాపోయారు.
మస్కట్‌లో బాధితురాలి దీనగాథ జర్నలిస్టుల ద్వారా కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఆమెను తీసుకురావడానికి అయ్యే పూర్తి ప్రయాణ ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ సూచనలతో మసట్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు అహ్మద్, ఈటీసీఏ అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్ భారత ఎంబసీ, మసట్ పోలీసులతో సమన్వయం చేసి బాధితురాలిని సబ్ ఏజెంట్ చెర నుంచి తప్పించారు. మంగళవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
తనకు అండగా నిలిచి పునర్జన్మనిచ్చిన కేటీఆర్ జీవితాంతం రుణపడి ఉంటానని బాధిత మహిళ భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ చేరుకున్న మహముదా కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలెవరూ నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లవద్దని, తప్పనిసరిగా ప్రామాణిక కంపెనీ వీసా లేదా వర్ వీసాతోనే వెళ్లాలని కేటీఆర్ సూచించారు. గల్ఫ్‌లో చికుకున్న తెలంగాణ పౌరులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.