హనుమకొండ, జనవరి 26 : దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని స్వాతంత్య్ర సమరయోధుడు బేరి అడవయ్య ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో భాగంగా కలెక్టర్ స్నేహా శబరీష్ అధికారులతో కలిసి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తున్న క్రమంలో అడవయ్య లేచి ‘మీ సన్మానం వద్దు’ అంటూ తిరస్కరించారు. ముందుగా సంక్షేమంతోపాటు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.
కొన్నేండ్లుగా వందల దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడే ఉన్న కొందరు అధికారులు సముదాయించే ప్రయత్నం చేయగా.. ‘ఇప్పటికి చాలామంది రేపు రండి పరిష్కరిస్తాం అని దాటవేసేలా మాట్లాడుతున్నారు. దేశం కోసం కొట్లాడిన మేము నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నాం. హనుమకొండ బాలసముద్రం లో స్వాతంత్య్ర సమర యోధులకు ఆఫీసు కేటాయించగా అక్కడ చెత్తు పోస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అని ప్రశ్నించారు. ముందుగా తమ సమస్యలకు పరిషారం చూపాలని, ఆ తర్వాతే సతారాలు, సన్మానాలు చేయాలని అడవయ్య డిమాండ్ చేశారు.