ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5: రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధుల్లో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందాపై సమగ్ర విచారణ చేసి, రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఇబ్రహ్నీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డిని ఆదేశించారు. రాచకొండ పరిధిలో వేలాది ఎకరాలు గతంలోనే రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఆ భూములను తక్కువ ధరకు డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారంపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ‘రాచకొండలో అరాచకకాండ’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇందుకు స్పందించిన కలెక్టర్ శశాంక్ వెంటనే విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోను ఆదేశించారు.
సోమవారం ఇబ్రహీంపట్నంలోని ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన ఆయన ఆర్డీవో, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాచకొండ పరిసర ప్రాంతాల్లో గుట్టుగా సాగుతున్న భూ దందాలో భాగంగా డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఆరా తీసినట్టు తెలిసింది. రెండు రోజుల్లో ఈ విషయంపై పూర్తిస్థాయిలో నివేదికను తనకు అందజేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా రెవెన్యూ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులతోపాటు దళారులు కూడా ప్రవేశించటాన్ని ప్రస్తావించి తగు సూచనలు చేసినట్టు సమాచారం. కలెక్టర్ వెళ్లిన అనంతరం ఆర్డీవో అనంతరెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశానుసారం రెండు రోజుల్లో విచారణ చేసి, నివేదిక సమర్పిస్తామని తెలిపారు.