Vemulawada | కరీంనగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వేములవాడ ఆలయ కోడెల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేసినా ఆలయ అధికారులు తనకు తెలియకుండానే మూడో దశ కోడెల పంపిణీ ఎలా చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆగ్రహం వ్యక్తంచేశారు. తన ఆమోదం లేకుండా మూడో దశలో 188 కోడెల పంపిణీ ఎలా చేశారని ప్రశ్నిస్తూ దీనిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఈ నెల 7న ‘రాజన్న కోడెలు కోతకు!?’ శీర్షికన మొదలు పెట్టి.. నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురించింది. ఈ విషయంలో దేవాదాయ శాఖ మంత్రి ఓ రకంగా.. అధికారులు మరోరకంగా మాట్లాడటాన్ని ఎప్పుటికప్పుడు ఎండగట్టి, ఈ వ్యవహారంలో మొత్తం తీగలాగి కబేళాకు కోడెలను అమ్మింది వాస్తవమేనని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించారు.
మంగళవారం కలెక్టరేట్లో వేములవాడ ఆలయ, గోశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. గోశాలకు కోడెల పంపిణీకి కలెక్టర్ అనుమతి తప్పనిసరి ఉండాలని, అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. పంపిణీకి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 1,975 పశువులను గోశాల నుంచి పంపిణీ చేశామని, వీటిలో మొదటి దశ 1,278 కోడెలు, 75 ఆవులు, రెండో దశ 389 కోడెలు, 45 ఆవులు, మూడో దశ 188 కోడెలు పంపిణీ చేశామని అధికారులు వివరించారు. మొదటి, రెండు దశలకు మాత్రమే కలెక్టర్ అనుమతి తీసుకొని పంపిణీ చేయగా, మూడవ దశ అనుమతి లేకుండా ఎలా చేశారని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోశాల నుంచి పంపిణీ చేసిన 1,975 పశువుల స్థితిగతులపై ఈ నెల 20 వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.