వరంగల్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార విధుల కన్నా కాంగ్రెస్ నేతలతో సఖ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్‌పై వరంగల్ కలెక్టర్ సత్యశారద చర్యలకు ఉపక్రమించారు. అజాంజాహి మిల్లు కార్మిక భవన్ కబ్జా వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావుతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో విచారణ అధికారిగా ఉన్న తహసీల్దార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతతో కలిసి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌కు కలెక్టర్ నోటీసు ఇచ్చారు.