అలంపూర్ చౌరస్తా, జూలై 31 : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో వసతులు లేవని పేర్కొంటూ బుధవారం విద్యార్థులు రోడ్డెక్కిన విషయం తెల్సిందే. కాగా గురువారం కలెక్టర్ సంతోష్ సదరు పాఠశాలను సందర్శించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ప్రిన్సిపాల్, వార్డెన్, హౌస్మాస్టర్కు మెమో జారీ చేశారు. అంతకుముందు ఆయన తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కాగా విద్యార్థిపై వేధింపులకు పాల్పడిన ఘటనలో భవనం యజమాని గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శేఖర్ తెలిపారు.