హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ‘నా మాటే శాసనం.. నేను చెప్పిందే వేదం’ అన్నట్టుగా జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వ్యవహారశైలి వివాదాస్పదం అవుతున్నది. విధుల్లో చేరినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అధికార యంత్రాంగాన్ని ఇరుకున పెడుతుండగా, కలెక్టర్ బాధితులు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. సమీకృత కలెక్టరేట్‌కు ముందు రోడ్డుపై గోడకు ఓ మూలన డీఆర్డీఏ సహకారంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపార నిర్వహణకు గత కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా అనుమతించారు. దళిత మహిళలు అక్కడ ఏర్పాటు చేసుకున్న వనిత టీ స్టాల్, విజయ మిల్ పార్లర్‌ను ఆయనే స్వయంగా ప్రారంభించారు.
జనగామ కలెక్టర్‌గా సందీప్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే, ఇప్పుడు ఆ దుకాణాలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వివాదానికి కారణమైంది. కలెక్టర్ నిర్ణయాన్ని నిరసిస్తూ సీపీఎం, జేఏసీ, ప్రజాసంఘాలు దళిత మహిళలకు మద్దతుగా ఆందోళన చేశాయి. అయినా లెక్క చేయకుండా పలుమార్లు దుకాణాల తొలగింపునకు అధికారులను పురమాయించడంతో, బాధిత మహిళలు హైకోర్టును ఆశ్రయించి తాతాలిక మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో బాధిత మహిళలు షాపులు తెరిచి వ్యాపారం కొనసాగిస్తుండగా ఫుడ్ ఇన్స్పెక్టర్ను పంపించి తనిఖీలు చేయించడంతోపాటు నిర్వాహకులతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. దీనిపై శనివారం వారు స్వయంగా కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకునేందుకు ప్రయత్నించారు.
ఆయన వారితో మాట్లాడేందుకు ఇష్టపడకపోవడంతో కాళ్లపై పడి ప్రాధేయపడేందుకు ప్రయత్నించారు. ‘అయ్యా కలెక్టర్ సారు.. మా మీద కరుణ చూపండి.. మా ఉపాధిని తొలగించకండి.. మా వనిత టీ స్టాల్‌ను కొనసాగించుకోవడానికి సహకరించండి.. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులతో వేధింపులు ఆపండి.. నీకాళ్లు మొకుతా’ అని వేడుకున్న టీ స్టాల్ నిర్వాహకురాలు పాలమాకుల చిన్న మంజుల ఆమె భర్త కనకయ్య వైపు కనీసం చూడకుండా పోతుంటే కలెక్టర్ కాళ్లపై పడేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ వెంట ఉన్న గన్‌మెన్ నర్సయ్య మహిళపై అభ్యంతరకరంగా చేయివేసి బలవంతంగా నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీన్ని తీవ్రంగా నిరసించిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గోపి.. కలెక్టర్ సాక్షిగా జరిగిన ఘటనకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని, మహిళ మీద చేయి వేసిన గన్‌మెన్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పండుగ రోజూ పరీక్ష
శనివారం రంజాన్ పండుగ రోజు కలెక్టర్ మరో వివాదానికి కారణమయ్యారు. జిల్లాలో జనాభా లెక్కల సేకరణ కోసం ఇటీవల కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంపై 14 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, మల్టీ టాసింగ్ స్టాఫ్ పోస్టుకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా పోస్టులకు దాదాపు 300 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే అందులో 101 మంది పేర్లను షార్ట్‌లిస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 11 గంటలకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు రంజాన్ పండుగ (శనివారం) సెలవు రోజు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రావాలని మెసేజ్‌లు వచ్చాయి. తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ముస్లిం, మైనారిటీ యువకులు, మహిళలు సైతం పండుగను పక్కనబెట్టి కలెక్టరేట్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వెళ్తే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అభ్యర్థులకు అధికారులు పరీక్ష పెట్టారు. అందులోనూ షార్ట్‌లిస్ట్ అయిన 101 మందిలో కేవలం 89 మందినే ఎగ్జామ్స్ సెంటర్‌కు అనుమతించి 11 మందిని పరీక్ష రాయడానికి నిరాకరించడంపై బాధిత అభ్యర్థులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తంచేశారు. కలెక్టర్, అధికారులు కుమ్మక్కై పోస్టులను అమ్ముకుని నిరుద్యోగులను ఆశ పెట్టి మోసం చేశారని బాధిత అభ్యర్థులు ఆవేదన చెందారు. డబ్బులు ఇచ్చిన వారినే ఎగ్జామ్ రాయడానికి అనుమతించారని పలువురు ఆరోపించారు. పైగా ఒక నేషనల్ హాలిడే అయిన రంజాన్ పండుగ రోజు ఎలా పరీక్ష పెడతారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులందరికీ మళ్లీ ఎగ్జామ్స్ పెట్టాలని డిమాండ్ చేశారు.
వాహనాల పార్కింగ్‌లోనూ వివక్ష
జనగామ కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు గతంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ల వాహనాలు పార్క్ చేసేవారు. దీన్ని పూర్తిగా మార్చి వేయించిన ప్రస్తుత కలెక్టర్.. ప్రధాన గేట్ గ్రీల్స్ తొలగించి రాజసం, దర్పం ఉట్టిపడేలా తన ఒక్కడి వాహనం మాత్రమే లోపల క్యాంటీన్ వద్ద పార్క్ చేయిస్తూ అదనపు కలెక్టర్ల వాహనాలను వెనుకవైపు పార్క్ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గత కలెక్టర్ వినియోగించిన వాష్‌రూమ్‌ను వాస్తు పేరిట తొలగించి మార్పులు చేయించడం కూడా వివాదాస్పదం అవుతున్నది.
కింది స్థాయి అధికారులు నిలబడాల్సిందే
కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా తన చాంబర్లో కేవలం గ్రూప్-1 అధికారులను మాత్రమే కూర్చోబెట్టి, మిగిలిన కింది స్థాయి జిల్లా అధికారులను దగ్గరకు రానివ్వకుండా పనిపై వెళ్తే నిలబెట్టి మాట్లాడటంపై అధికారులు గుర్రుగా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లకు జిల్లా వైద్యాధికారి సెలవులు మంజూరు చేసేవారు. కానీ ఈయన వచ్చిన తర్వాత అంతా తానే అన్నట్టు డీఎంహెచ్‌వోకు పీహెచ్సీ వైద్యులకు సెలవులు తానే ఇవ్వాలనే విధంగా వేధింపులకు పాల్పడుతున్నారని ప్రభుత్వ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ పీహెచ్సీలో పనిచేసే మహిళా డాక్టర్ తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని సెలవుపై వెళ్లగా ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె తన భర్తకు సంబంధించిన మెడికల్ ఫైల్‌ను కలెక్టర్‌కు చూపిస్తే అందంతా తనకు తెలియదంటూ ఆమెను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించారని తెలుస్తున్నది. ఖాళీగా ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా కలెక్టర్ తనకు తానే ఎఫ్ఏసీ డీఈవోగా ఉత్తర్వులు ఇచ్చుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు విస్మయం వ్యక్తంచేశాయి. జిల్లా ప్రజాప్రతినిధులను సైతం కలెక్టర్ లెక్కచేయడం లేదని అంటున్నారు. తాజాగా ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక సభ కోసం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉదయం 9.30 గంటలకు అక్కడికి వెళ్లారు. కలెక్టర్ మాత్రం 10.30 గంటలకు చేరుకున్నారు. అధికార పార్టీ ఎంపీలైనా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా కలెక్టర్ లెక్కచేయకుండా దూకుడుగా వెళ్తుండటంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది.
వనిత టీ స్టాల్ తొలగించాలనడం అన్యాయం ; జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ కలెక్టరేట్ సమీపంలోని వనిత టీ స్టాల్, విజయ మిల్ పార్లర్‌ను తొలగించకూడదని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. గత కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కలెక్టరేట్ కాంపౌండ్ బయట ఇద్దరు దళిత మహిళలకు డీఆర్డీఏ ద్వారా లోన్ ఇప్పించి కరెంటు కనెక్షన్ ఇచ్చి, ఫుడ్ సెక్యూరిటీ సర్టిఫికెట్ అందజేసి ఆయనే స్వయంగా ప్రారంభించిన వనిత టీ స్టాల్, విజయ మిల్ పార్లర్‌ను ప్రస్తుత కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తొలగించాలని ఆదేశించడం సరికాదని అన్నారు. టీ స్టాల్ తొలగిస్తే మహిళలు తీసుకున్న రుణాలు ఎలా చెల్లిస్తారో అధికారులు ఆలోచించాలని పేర్కొన్నారు.
శనివారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడుతూ.. స్టాల్స్ తొలగింపును ఆపాలని తాను కలెక్టర్‌కు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశానని, ఇప్పుడు లేఖ కూడా రాస్తున్నట్టు చెప్పారు. ఒక కలెక్టర్ ఇచ్చిన అనుమతిని మరో కలెక్టర్ ఆక్రమణ అనడం సరికాదని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దళిత మహిళ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా.. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులు ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారులపై ప్రభుత్వ అధికారులు తమ ప్రతాపాన్ని చూపించొద్దని కోరారు. స్టాల్ నడవకపోతే వారు తెచ్చుకున్న అప్పులు తీర్చలేక రోడ్డున పడుతారని పేర్కొన్నారు. అధికారులు కోర్టు ఆదేశాలను గౌరవించి ఇద్దరు పేద మహిళల స్టాల్స్‌ను కొనసాగించాలని కోరారు.