కరీంనగర్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ సాక్షిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు అవమానం జరిగింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జెండా వందనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్య అతిథికి కలెక్టర్ స్వాగతం పలకాలి. కానీ, ఆయన వచ్చినా కలెక్టర్ జాడ లేదు. దీంతో ఎస్పీ గితే మహేశ్, మరికొందరు అధికారులతో కలిసి ఆయన వేదికపైకి వెళ్లారు.
అనంతరం కలెక్టర్ రాకకోసం కొంతసేపు ఎదురుచూశారు. అయినప్పటికీ ఆయన రాకపోవడంతో ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో కలెక్టర్ వేదికపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రొటోకాల్ ఉల్లంఘనపై విప్‌కు కలెక్టర్ సారీ చెప్పినట్టు తెలిసింది. అయితే, అప్పటికే అసహనంతో ఉన్న శ్రీనివాస్ ‘ఈ కార్యక్రమం సాక్షిగా పరువు తీయాలనుకున్నావ్.. తీసినవ్’ అంటూ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
జెండా ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనను విప్ తనకు జరిగిన అవమానంగా భావించినట్టు తెలిసింది. తనను అవమానించేందుకే ప్రజా పాలన దినోత్సవాన్ని కావాలనే తూతూమంత్రంగా ముగించారని విలేకరులతో జరిపిన చిట్‌చాట్‌లో ‘ఆఫ్ ది రికార్డ్’గా ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పంద్రాగస్టు వేడుకల్లోనూ కలెక్టర్ తనకు స్వాగతం పలకలేదని ఓ మిత్రుడు గుర్తుచేశాడని, ఈ రోజు మరోమారు అదే జరిగిందని ఆయన వాపోయినట్టు తెలిసింది.
బీసీ బిడ్డగా ఇది తనకు అవమానమేనని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. ప్రొటోకాల్ ఉల్లంఘన విప్ టార్గెట్‌గా జరిగిందన్న చర్చ నడుస్తున్నది. ఆదికి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు కొంతకాలంగా పడటం లేదని తెసింది. తాజా ఘటన ఇద్దరి మధ్య మరింత దూరం పెంచింది. కలెక్టర్ వ్యవహారశైలిపై విప్ ఇప్పటికే అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. తాజా ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని పలువురు చర్చించుకోవడం కనిపించింది.