ఖమ్మం సిటీ, ఏప్రిల్ 16 : ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా పెద్ద దవాఖాన ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నివార్డులతోపాటు ప్రసవాల గదిని పరిశీలించారు. సెకండ్ ఎస్ఎన్సీయూలోని పిల్లలను పరామర్శించారు. విధుల్లో ఉండాల్సిన గైనకాలజీ వైద్యులు, పిడియాట్రిషన్ వైద్య నిపుణులు, ఇతర సిబ్బంది గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట దవాఖానకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అక్కడి నుంచి బయలుదేరి జనరల్ దవాఖానకు వెళ్లారు. ఆ సమయంలో క్యాజువాలిటీ విభాగంలో విధుల్లో ఉండాల్సిన వైద్యుడు బయటికి వెళ్లారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్న విషయం సిబ్బంది ద్వారా తెలుసుకొని హుటాహుటిన దవాఖానకు వచ్చారు. అప్పుడే కలెక్టర్ ఆయన గురించి ఆరా తీయగా ఉన్నాను ‘సార్’ అంటూ అందరిలో కలిసిపోయారు.