హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ.మూడు వేల కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు రైతుల నుంచి రూ.13,264 కోట్ల విలువైన ధాన్యం కోనుగోలు చేయగా వారి ఖాతాల్లో మొత్తంగా రూ.9,168 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ నెల 20 లోగా మిగిలిన రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటివరకు 11 లక్షల మంది రైతుల నుంచి 64.52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సీజన్లో 7,034 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా కొనుగోళ్లు పూర్తవ్వడంతో 6,143 కేంద్రాలను మూసివేసినట్టు వెల్లడించారు. 18 జిల్లాల్లో ధాన్యం సేకరణ సంపూర్ణంగా పూర్తయిందని చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ ఆదివారం కల్లా కొనుగోళ్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ యాసంగిలో గత సీజన్ కన్నా 15 లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని తెలిపారు.
సీఎం కేసీఆర్ కృషితో నంబర్ 1
రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, నీళ్లు, గ్రామంలోనే కొనుగోళ్లు వంటి రైతు అనుకూల విధానాలతో మండే ఎండల్లోనూ తెలంగాణలో పసిడి పంటలు పండించినట్టు మంత్రి గంగుల తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న రైతు పక్షపాత నిర్ణయాలతో తెలంగాణ దేశంలోనే యాసంగి ధాన్యం సేకరణలో నంబర్ 1 నిలిచిందని పేర్కొన్నారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 56.84 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణలో పాల్గొన్న హమాలీలు, సహకార సంఘాలు, మిల్లర్లు, అధికార యంత్రాంగానికి గంగుల కృతజ్ఞతలు తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లు