హైదరాబాద్ : రైత పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కన్నా అధికంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
దేశ వ్యాప్తంగా సేకరించిన 593 లక్షల మెట్రిక్ టన్నులలో 70 లక్షల మెట్రిక్ టన్నులతో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా మంత్రి వివరాలను వెల్లడించారు.
ప్రతి గింజ కొనాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా దాదాపు 44 శాతం అధికంగా 21.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించామని, దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల్ని సేకరించి కేంద్రం నిర్దేశించిన దానికన్నా 1.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా సేకరించామన్నారు.
ఇందుకోసం కరోనా కాలంలో అత్యధికంగా 6,872 కొనుగోళు కేంద్రాల ద్వారా 13,690 కోట్ల విలువగల ధాన్యాన్ని 12.78 లక్షల మంది రైతుల నుంచి సేకరించామన్నారు. రెండు రోజుల నుంచి అత్యధికంగా వారంలోపే రైతుల ఖాతాల్లోకి నగదును బదిలిచేస్తున్నామన్నారు.
గతం కన్నా 5 కోట్ల అధిక గన్నీ సంచుల్ని సకాలంలో అందుబాటులో ఉంచామని, అకాల వర్షాలతో అక్కడక్కడా తేమకు సంబందించిన ఇబ్బందులు మినహా ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించామన్నారు. అక్కడక్కడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాల్ని సీఎం కేసీఆర్ అమలు చేయడం వల్లే ఇదంతా సాధ్యమయిందన్నారు.